కోడెల వ్యాఖ్యలపై నేషనల్ మీడియా గగ్గోలు

First Published Feb 16, 2017, 3:43 AM IST
Highlights

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కోడెల ‘కారు’ కామెంట్లలో తప్పేమీలేదంటూ వెనకేసుకొస్తున్నారు

 

వంటింటికి పరిమితమైతేనే ఆడవాళ్ళకు మంచిదనే అర్థంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్థానికంగా రెండు తెలుగురాష్ట్రాలలో పెద్ద ప్రభావం కనిపించకపోయినా జాతీయస్థాయిలో మాత్రం అవి పెద్ద దుమారాన్నే లేపాయి. మహిళాసంఘాల నేతలు, వివిధ రాజకీయపార్టీల నాయకులు కోడెలపై నిప్పులు చెరుగుతున్నారు. స్పీకర్ అనే గౌరవనీయమైన పదవిలో ఉన్నవ్యక్తి, అది కూడా మహిళా సాధికారతపై అదే రాష్ట్రంలో అంతర్జాతీయ సదస్సు జరుగుతున్న సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సిగ్గు చేటు అని దుమ్మెత్తిపోస్తున్నారు.

 

ఆడవాళ్ళు బయటకు రావటంవలనే వేధింపులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని, కారులాగా గ్యారేజ్ లోనే ఉంటే ఏ గొడవా ఉండదని కోడెల చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీయకుండా తెలుగుదేశం పార్టీ స్థానికంగా సమర్థవంతంగా మీడియా మేనేజిమెంట్ చేసినా, అవి ఎలాగో జాతీయ మీడియా దృష్టిలోకి చేరుకున్నాయి. ఇప్పుడు జాతీయ న్యూస్ ఛానల్స్ లో కోడెలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమర్యాదకరంగా, కించపరిచేవిధంగా ఉన్న ఇలాంటి వ్యాఖ్యలను స్పీకర్ స్థాయి పదవిలో ఉన్న వ్యక్తి చేయటం సిగ్గుచేటని దుయ్యబడుతున్నారు. ఆడవాళ్ళు పంచదారలాంటివారని, బయట కనిపిస్తే చీమల్లాంటి మగవారిని ఆపలేమంటూ యూపీ అధికారపార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో కోడెల వ్యాఖ్యలను పోలుస్తున్నారు. స్పీకర్ పదవి గౌరవాన్ని దిగజార్చేవిధంగా కోడెల మాట్లాడారని విమర్శిస్తున్నారు.

 

మరోవైపు ఈవెంట్ మేనేజర్‌లాగా ఆ సదస్సు... ఈ సదస్సు అంటూ షో బిజినెస్ చేస్తూ కాలంగడుపుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం కోడెల వ్యాఖ్యలలో తప్పేమీలేదంటూ ఆయనను వెనకేసుకొచ్చారు. కోడెల అన్నదానిలో తప్పేమీ లేదని సమర్థించారు. జాతీయమీడియా ఓవరాక్షన్ చేస్తోందని అన్నారు. జాతీయమీడియానుకూడా జగన్ పార్టీ కొనేసిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. స్పీకర్ పదవికికూడా గౌరవం ఇవ్వకుండా కోడెలపై విమర్శలు చేయటమేమిటంటూ చిర్రుబుర్రులాడారు.

 

అటు ఇంతటి సంచలనానిని కారణమైన కోడెల, తాను ఆడవాళ్ళపై అనుచిత వ్యాఖ్యలేమీ చేయలేదని, అలా నిరూపిస్తే రాజకీయాలనుంచి వైదొలుగుతానని సవాల్ విసిరారు. అయితే వీడియా రికార్డ్ ఉందని ఆలస్యంగా తెలుసుకున్నారో, ఏమోగానీ - రెండురోజుల తర్వాత మహిళాలోకానికి క్షమాపణలు చెప్పారు. తాను ఆ అర్థంలో అనలేదని, ఎవరైనా అలా అర్థం చేసుకుని ఉంటే క్షంతవ్యుడినని అన్నారు.

 

జాతీయ మీడియాలో చర్చ - 

 

 

కోడెలకు చంద్రబాబు వత్తాసు - 


 

వైసీపీ నేత రోజాను మహిళా పార్టమెంట్ సదస్సు ప్రారంభంరోజున అరెస్ట్ చేయించటానికి కారణంకూడా కోడెల వ్యాఖ్యలేనని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా సాధికారత అంటు ఇంత పెద్ద సదస్సు నిర్వహిస్తున్న ప్రభుత్వంలోని నేతలు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటమేమిటని మహిళాపార్లమెంట్ లో ప్రస్తావించి, యాగీ చేస్తానని చెప్పటంతోనే ఆమెను ముందస్తుగా అరెస్ట్ చేయించామని చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఆమె నైతిక స్థైర్యాన్ని దెబ్బకొట్టి నోరు మూయించటంద్వారా ఈ విషయంలో బాబు ప్రభుత్వం విజయం సాధించిందనే చెప్పాలి.

 

మరోవైపు బయటకు సమర్థించినా చంద్రబాబు కోడెలపై లోలోపల పీకలదాకా కోపంగా ఉన్నారని అంటున్నారు. ఇటీవలే సుజనా చౌదరి పందుల పందాలు వ్యాఖ్యలు పార్టీకి అప్రతిష్ఠ తీసుకురాగా, ఇప్పుడు కోడెల ఈ వ్యాఖ్యలు చేసి మరో తలనెప్పి తెచ్చారని భావిస్తున్నట్లు తెలిసింది. ఆ భావం కోడెలను సమర్థించేక్రమంలో కూడా బయటపడింది. కోడెలను ఉద్దేశించి మాట్లాడుతూ - ‘అతను’,’ అన్నాడు’ అంటూ ఏకవచనంతో చంద్రబాబు సంబోధించారు.  

 

మొత్తంమీద ఈ వ్యాఖ్యలు కోడెలకు పెద్ద దెబ్బే కొట్టాయని అంటున్నారు. మహిళా పార్లమెంట్ సదస్సు విజయవంతంగా నిర్వహించి చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేసి త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో క్యాబినెట్ బెర్త్ ఖాయం చేసుకుందామనుకుంటుండగా, ఈ వివాదం దెబ్బతో అసలు ఉన్న పదవే ఊడిపోయే పరిస్థితి ఏర్పడుతుందేమోనని స్పీకర్ భయపడుతున్నారని చెబుతున్నారు. ఇటీవలే ఆయన కోడలు తనను అత్తింటివారు వేధిస్తున్నారని, తన కొడుకును బలవంతంగా లాక్కెళ్ళిపోయారని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా, మీ టైమ్ బాగున్నట్టుగా లేదు అధ్యక్షా!

click me!