రాజకీయ పార్టీలకు ఇబ్బందే

First Published Jan 3, 2017, 3:04 AM IST
Highlights

సుప్రింకోర్టు జారీ చేసిన తాజా ఆదేశాలు ఆచరణలోకి వస్తే మంచిదే. చూద్దాం త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఏ మేరకు ఆచరణలోకి వస్తాయో.  

ఒట్లడిగే విషయంలో తాజాగా సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు అధికారపార్టీలకు మింగుడుపడనిదే. ప్రస్తుత కాలమాన పరిస్ధితుల్లో కుల, మతాల ఊసు లేకుండా రాజకీయం  ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. అటువంటిది ‘కుల మతాల ప్రాతిపదికగా ఓట్లడగటం చట్ట విరుద్ధ’మంటూ సుప్రింకోర్టు చెప్పటం గమనార్హం. ఆ విధంగా అడగటం అవినీతి క్రిందకే వస్తుందని కూడా సుప్రింకోర్టు కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.

 

మరి రాజకీయపార్టీలు, ప్రత్యేకించి అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేయాలి? మన రాష్ట్రం విషయాన్నే తీసుకుందాం. అధికార టిడిపి వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని నిలుపుకునేందుకు మతాల వారీగా ‘చంద్రన్న కానుకలు’ పేరుతో తాయిలాలను పంచుతోంది.

 

ఎన్నికలపుడు సరే మతం, కులం పేరుతో ఓట్లడగకూడదు. మరి ముందునుండే తాయిలాలను పంచటాన్ని ఏమంటారు. ఆ విషయాన్ని కూడా సుప్రింకోర్టు చెబితే బాగుంటుంది.

 

హజ్ యాత్రలు, జెరూసలేం యాత్ర, దేవాలయాల దర్శనంకు ప్రత్యేక ప్యాకేజిలు నడపటం దేనికిందకు వస్తుంది? ఓట్ల కోసం కాకపోతే అధికార పార్టీలు ఎందుకు ప్రత్యేకంగా ప్యాకేజిలు ఎందుకు నడుపుతున్నట్లు. మరి సుప్రింకోర్టు ఈ విషయంపైన కూడా దృష్టి పెడితే బాగుంటుంది. అధికారంలో ఎవరున్నా జరుగుతున్నది ఇదే కదా?

 

మొన్నటి సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇపుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు అవే చేస్తున్నాయి. ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపే కుల, మతాల ప్రాతిపదికగా జరుగుతున్నపుడు ఓట్లడగటంలో రాజకీయ పార్టీలు ఎందుకు మౌనం వహిస్తాయి?

 

అసలు దేశంలో కుల, మతాల ప్రాతిపదికగా ఓట్లడగటం ఇపుడే మొదలైందా? మొత్తం సమాజమే కుల, మతాల ప్రాతిపదికగా చీలిపోతున్నపుడు రాజకీయ పార్టీలు మాత్రం మడికట్టుకుని కూర్చుంటాయా?

 

ఢిల్లీలోని ప్రధానమంత్రి మొదలు గ్రామస్ధాయిలో సర్పంచ్ ఎన్నిక వరకూ దశాబ్దాల పాటు ఓ పద్దతికి అలవాటు పడిపోయారు. మతం, కులం ప్రస్తావన లేకుండా మన దేశంలో రాజకీయాలను ఊహించగలమా? సుప్రింకోర్టు జారీ చేసిన తాజా ఆదేశాలు ఆచరణలోకి వస్తే మంచిదే. చూద్దాం త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఏ మేరకు ఆచరణలోకి వస్తాయో.  

click me!