ఈసారైనా రోజాని అనుమతిస్తారా?

First Published Nov 25, 2017, 2:56 PM IST
Highlights
  • ఈనెల 27న అమరావతి డిక్లరేషన్
  • విడుదల చేయనున్న చంద్రబాబు
  • మహిళా పార్లమెంటరీ సదస్సుకి కొనసాగింపుగా అమరావతి డిక్లరేషన్

ఈ నెల 27న‘ అమరావతి డిక్లరేషన్’ అట. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించిన ‘ మహిళా పార్లమెంటీరియన్ సదస్సు’ కి కొనసాగింపు కార్యక్రమం ఇది.  అప్పుడు ఆ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఎంత రచ్చ అయ్యిందో.. కార్యక్రమానికి రెండు రోజుల ముందు స్పీకర్ కోడెల అన్న మాటలు ఎంత వివాదాస్పదమయ్యాయో.. ఎమ్మెల్యే రోజాని అడ్డుకోవడం కూడా అంతే వివాదాస్పదమైంది.

అసలు విషయం ఏమిటంటే..  ఈ నెల 27న  ‘అమరావతి డిక్లరేషన్’ ని సీఎం చంద్రబాబు విడుదల చేస్తారని స్పీకర్ కోడెల చెప్పారు. ఇంతకీ ఆ డిక్లరేషన్ లో ఏముంటుందో తెలుసా.. మహిళా సాధికారత గురించిన అంశాలు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మూడు రోజుల పాటు ‘ మహిళా పార్లమెంటీరియన్ సదస్సు’ నిర్వహించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. మహిళల పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి  మహిళా ఎమ్మెల్యే రోజాని రానివ్వలేదు. ఆమెను ఎయిర్ పోర్టులోనే పోలీసులు  అడ్డుకున్నారు. కొన్ని గంటలపాటు ఎయిర్ పోర్టులోనే బంధించేశారు. చివరికి ఆమెను సభకి రానివ్వకుండా హైదరాబాద్ లో ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టారు.

ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తే.. రోజా  సభని అడ్డుకోవడానికి వస్తుందని తమకు ఇంటిలిజెన్స్ రిపోర్టు అందిందని అందుకే.. ఇలా చేశామంటూ కాకమ్మ కబుర్లు చెప్పారు. అలాంటప్పుడు అసలు సభకి ఎందుకు ఆహ్వానించాలనంటూ  వైసీపీ నేతలు అడిగిన ప్రశ్నకు ఇప్పటివరకు స్పీకర్ సమాధానం చెప్పలేదు. ఈ కార్యక్రమానికి ముందు స్పీకర్ విలేకరులతో మాట్లాడుతూ..‘ కారు షెడ్డులో ఉండాలి.. మహిళలు వంటింటిలో ఉండాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. ఫిబ్రవరిలో నిర్వహించిన కార్యక్రమానికి అనుసంధానంగా ‘అమరావతి డిక్లరేషన్’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మహిళా పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నారు. అయితే.. ఇక్కడే అందరికీ అనుమానాలు మొదలౌతున్నాయి. గతంలో లాగే పిలిచి.. మళ్లీ రోజాని అవమానిస్తారా అని. గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం మహిళలను గౌరవిస్తామని, మహిళలు అభివృద్ధి చెందాలంటూ ఉపన్యాసాలు ఇస్తారు. ఆచరణలో మాత్రం తోటి పార్లమెంట్ మహిళా సభ్యురాలిని కూడా గౌరవించరనే వాదనలు వినపడుతున్నాయి. మరి ఈ సారైనా రోజాకి అనుమతి ఇస్తారో లేదో చూడాలి.

click me!