
కర్నూలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆకె రవికృష్ణ బదిలీ అయ్యారు.
ఇది కర్నూలు జిల్లాకు కొంత నష్టం, అయితే, ఆయన వెళ్లే జిల్లాలో మాత్రం కొంత చాప్టర్ మొదలవుతుంది.
ఎందుకంటే రవికృష్ణ పనితీరు భిన్నంగా ఉంటుంది. జనంతో కలసిపోయేందుకు ఆయన ఎన్నుకున్న వ్యూహం సాధారణంగా పోలీసు అధికారులలో అరుదుగా కనిపిస్తుంది. ఎస్ పిగా అయన లేని లోటును మరొక ఎస్ పి పూరించవచ్చు. అయితే, మరొక లోటు ఉంది. ఆ వెలితి అంత తేలికగా పోదు. అది ఆకెళ్ల రవి కృష్ణ సోషల్ వర్కర్ కోణానికి సంబందించినది .ఆయన కళాకారుడు, రచయిత, అంతకంటే ముఖ్యంగా సంస్కర్త. పోలీసుఅధికారిగానే కాదు, బాధ్యతెరిగిన పౌరుడు కాబట్టి, ఖాకి తోపాటే, కలంతో , గళంతో కూడా ఆయన ప్రజల్లోకి వెళ్లిపోయారు.
ఎక్కడ ఏది వాడలో అక్కడ అది వాడారు. అవసరమయిన చోట అరెస్టు లు చేశారు. పాట అవసరమయిన చోట్ల గళం ప్రయోగించారు. కలం ఝళిపించారు. మంచి జరగుతుందున్నపుడు మనిషిగా కపట్రాల్ల వంటి గ్రామాన్ని కూడా దత్తత తీసుకుని సంస్కరించే పని చేశారు. తను బదిలీ అయిపోతే, ఈ వూరి పరిస్థితేమిటి? అలాంటి ప్రశ్న తలెత్తకుండా ఉండేందుకు, జిల్లాతో అనుబంధం తెగిపోకుండా ఉండేందుకు కపట్రాల్లో ఒక చిన్న ఇల్లు కూటా కట్టుకున్నారు.
ఆయనకు ముందు జిల్లాకు చాలా మంది ఎస్ పిగా వచ్చారు. ఇక ముందు కూడా వస్తారు. ఎవరి ప్రత్యేకతలు వాళ్లవి. మంచి పోలీసాఫీసరుగా వీరిలో చాలామందికి పేరు వచ్చింది.
అయితే, బదిలీ అయిపోయాక జిల్లాలో గుర్తుండిపోయే ఆనవాళ్లు మిగిలించినవాళ్లు చాలా తక్కువ. అలాంటి వాళ్లెవరయినా ఉంటే రవి కృష్ణ ఒకరు.
కారణం, ఖాకీ, లాటీ ఆయన సహజ స్వభావాన్ని మార్చలేకపోయాయి. వీటికి తక్కువ పని పెడుూ ఎక్కువ సంస్కరణలు తీసుకురావడమెలా అని ఆలోచించారు. అందుకే ఆయన ఆడశిశువుగా గురించి అద్భుతమయిన వీడియో తీసుకురాగలిగారు. సొంతంగా సందేశాత్మక పాట రాశారు, గానం చేశారు, కంపోజ్ చేశారు. ఇలాంటి సంఘ సంస్కర్త తనలో దాక్కుని ఉన్నాడు కాబట్టే ఆయన తుపాకి ఖాకీ ప్రజలను జడిపించలేదు. ఆయన్ని కలుసుకోవడానికి, మిత్రుడి ఇంటికి వెళ్లినట్లు కార్యాలయానికి వెళ్లవచ్చు, క్యాంపు ఆఫీసుకూ వెళ్లవచ్చు.
పోలీసు ఠీవిని నీరు కార్చారనే విమర్శకూడా ఉంది ఆయన మీద. పోలీసుగా పనిచేయకుండా ఆయన సోషల్ వర్కర్ గా పనిచేయాలనుకోవడం ఏమిటని అన్నవాళ్లూ ఉన్నారు. సోషల్ వర్క్ ని పోలీసింగ్ లో భాగం చేశారాయన. సోషల్ వర్క్ ద్వారా పబ్లిక్ లైఫ్ ని అర్డర్ లో పెట్టడం ఆయన ఎంచుకున్న మార్గం. విద్యార్థులను,కుర్రకారుని ఎలా ఎంగేజ్ చేయాలో ఆయనకు తెలుసు.అందుకే కపట్రాల్ల కోసమయినా, స్వచ్ఛ భారత్ కోసమయిన వీళ్లలో ఒకడిగా కలసిపోయి సైకిల్ యాత్ర చేస్తాడు. అలాగా జనంతో కలసి చాప కూడా తింటారు.
ఆయనతో స్ఫూర్తి పొందిన వారెందరో ఉన్నారు. ఆయన ఫేస్ బుక్ లో ఆయన ఫ్యాన్ క్లబ్ ఉంది. వాళ్లు కూడా సాంఘిక సేవాకార్యక్రమాలు చేస్తుంటారు. జిల్లా యువతలో ఆయన పిచ్చి అభిమానులున్నారు. ఆయన ఉత్తమ పోలీసాఫీసర్ గా కొందరు చూస్తే, మరికొంతమంది మంచి మనిషిగా చూస్తారు. అయితే, చాాలా సివిల్స్ రాసే వాళ్లు ఆయన ఏకలవ్య శిష్యులయిపోయారు. ఇలా ఒక పోలీసాఫీరు జిల్లా యువకులకు ఇన్ని విధాలుగా స్ఫూర్తి నిచ్చింది రవికృష్ణ ఒక్కరే.
కర్నూలు ప్రజల జీవితాలతో ఇంతగా పెనవేసుకుని పోయిన ఎస్ పి ఈ మధ్య కాలంలో ఎవరూ లేరనే చెప్పాలి. అందుకే ఆయన బదిలీ చర్చనీయాంశమయింది. కొందరికి షాక్ అయింది. అయితే, బదిలీ అయినా కర్నూలు జిల్లాతో ఆయన అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది.