చదువులతల్లిని చంపేసిన మీడియా.. పేదరికాన్ని చూపడంతో టాపర్ సూసైడ్

First Published May 23, 2017, 2:53 PM IST
Highlights

టీఆర్పీ రేటింగ్ ల కోసం మీడియా చూపిస్తున్న అత్యుత్సాహానికి ఓ ‘సరస్వతి’ బలైపోయింది.  

లక్ష్మీలేని ఇంటి సరస్వతి కటాక్షం... మట్టిలో మాణిక్యం.... ఆటోడ్రైవర్ ఇంట స్టేట్ టాపర్...

 

ఇలాంటి హెడ్డింగ్ లు పెట్టేటప్పుడు ఇకనైనా మీడియా జాగ్రత్త వహించాలి. లేకుంటే ఎందరో సరస్వతి బిడ్డలు ఇలానే ఆత్మహత్య బాటపట్టే ప్రమాదం ఉంది.

 

మీడియా చూపిన అత్యుత్సాహానికి కేరళలోని కన్నూరు ప్రాంతంలో ఇంటర్ టాపర్ ఆత్మహత్య చేసుకుంది. నిజంగా ఆమె చావుకు మీడియానే కారణమంటే అవుననే అంటున్నారు నెటిజన్లు.

 

కన్నూర్ లోని శివపురం హైయ్యర్ సెకండరీ స్కూల్ లో ఇంటర్ చదువుతున్న రఫ్సీనా (17) ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో మంచి ప్రతిభ కనబర్చింది. 1200 మార్కులకుగాను 1180 మార్కులు సాధించి 96 శాతంతో స్కూల్ టాపర్ గా నిలిచింది.

 

అయితే మీడియా ఆమెను పొగుడుతూనే ఓ పొరపాటు చేసింది. ఆమె ప్రతిభను పక్కన పెట్టి వారి కుటుంబ పేదరికాన్నే హైలైట్ చేసింది.

 

ఒకే ఒక్క రూంలో జీవనం సాగిస్తున్న రఫ్సీనా కుటుంబంలో అందరూ సరస్వతి బిడ్డలేనని పొగిడింది. రఫ్సీనాకు తండ్రి లేడు. తల్లి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. అన్న బెంగళూరులో పనిచేస్తుండగా, అక్క బీఫార్మసీ చేస్తుందంటూ ప్రసారాలు చేసింది.

 

అయితే ఈ వార్తలతో ఆ కుటుంబం కలవరపడింది. ఇన్నాళ్లు రఫ్సీనా స్నేహితులకు కూడా వారు అంత పేదరికంలో ఉన్నవాళ్లని తెలియదట. మీడియా పుణ్యాన అందరికీ ఈ విషయం తెలియడంతో కలతచెందిన రఫ్సీనా దారుణానికి ఒడిగట్టింది. రెండు రోజుల కిందట ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

 

ఈ ఆత్మహత్యపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టీఆర్పీ రేటింగ్ లకోసం మీడియా అత్యుత్సాహం వల్లే  ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. అసలు మీడియానే ఆమెను చంపిందని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

click me!