
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అందరూ ఆశీర్వదించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్.. ప్రజా సంకల్ప యాత్ర సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇడుపులపాయకు వైసీపీ నేతలు, కార్యకర్తలు, జగన్ అభిమానులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు.
కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి రోజా మాట్లాడుతూ.. రాజన్న రాజ్యం వైఎస్ జగన్ తోనే సాధ్యమన్నారు. జగన్ పాదయాత్రతో.. చంద్రబాబు ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు. ఇప్పటి నుంచి టీడీపీ నేతలు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. గత మూడున్నరేళ్లలో.. టీడీపీ ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు.
రుణమాఫీ పేరుతో రైతులను, ఇంటికో ఉద్యోగం అంటూ యువకులను, డ్వాక్రా రుణమాఫీ అంటూ మహిళలను మోసం చేశారన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు వైఎస్ జగన్ అండగా ఉంటారని చెప్పారు. మూడు వేల కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలను తెలుసుకుంటారన్నారు. రాజన్న రక్తం వస్తోందని కార్యకర్తలంతా తొడగొట్టి చెప్పండని ఆమె పిలుపునిచ్చారు.
కాగా, సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సాఆర్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో నివాళులర్పించారు. కుటుంబసభ్యులతో పాటు పలువురు నేతలు వెంటరాగా ఘాట్ నుండే సరిగ్గా 9.47 నిముషాలకు పాదయాత్రను జగన్ ప్రారంభించారు.