
తమిళనాడులో అమ్మ మృతి తర్వాత ఏఐడీఎంకేలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పన్నీరు వర్గంపై వేటు వేయడంతో ఆయన కొత్త కుంపటి పెట్టుకున్నారు. ఇక పార్టీ పగ్గాలు చేపట్టిన చిన్నమ్మ శశికళ సీఎం అవుదామనుకుంటే పాత కేసు అడ్డుపడింది.
కోర్టు తీర్పుతో ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. అయితే అమ్మ మృతితో ఆమె ప్రాతినిథ్యం వహించిన చెన్నైలోని ఆర్ కే నగర్ శాసన సభకు మళ్లీ ఎన్నికలు వచ్చిపడ్డాయి.
ఇప్పుడు అక్కడ గెలవడం ప్రతిపార్టీకి ప్రతిష్టాత్మకరంగా మారింది. ముఖ్యంగా పన్నీరు, శశికళ వర్గాలకు ఈ విజయం చావో రేవో సమస్య. అందుకే అక్కడి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రెండు వర్గాలు ఏ అవకాశాన్ని వదలడం లేదు.
ఈ మహాపోరులో విజయం సాధించడానికి చిన్నమ్మ వర్గీయులు ఓటర్లకు డబ్బులు ఎరగా చూపిస్తున్నారు. ఓటుకు రూ. 4 వేలు ఇస్తామంటూ ఆర్ కే నగర్ ప్రజలతో బేరసారాలకు దిగుతున్నారు. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన పన్నీరు వర్గీయులు ఓటుకు నోటు పేరుతో చిన్నమ్మ వర్గీయులు ఓటర్లకు డబ్బులు ఎలా పంచుతున్నారో స్టింగ్ ఆపరేషన్ తీసి వీడియోలను మీడియాకు రిలీజ్ చేశారు.