ఆధిపత్యానికి గండి

First Published Oct 21, 2017, 1:15 PM IST
Highlights
  • కడప జిల్లాలో ఆధిపత్య పోరు
  • మొన్నటి దాకా జిల్లాలో ఆధిపత్యం చెలాయించిన సీఎం రమేష్
  • సీఎం రమేష్ ఆధిపత్యానికి గండి కొట్టిన మంత్రి ఆదినారాయణ

కడప జిల్లాలో నిన్న మొన్నటి వరకు ఏక ఛత్రాధిపతి గా వెలుగొందాడు ఎంపీ సీఎం రమేష్.  ఆ జిల్లాలో ఏ పనికావాలన్నా.. అందరూ రమేష్ వద్దకే వచ్చేవారు. ఆయన ఊ.. అంటే చాలు అని భావించేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మొత్తం తారు మారైంది. ఆయన ఆధిపత్యానికి గండి పడింది.జిల్లా నేతలు కూడా ఆయనను ఇప్పుడు లెక్కచేయడం లేదు.

సీఎం రమేష్ కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అందుకు కారణం ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనే అందరూ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైసీపీ నేతగా పోటీ చేసి గెలుపొందాడు. ఆ తర్వాత టీడీపీలో ఫిరాయించాడు.  అప్పటి నుంచే వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. దీనికి తోడు ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేకి చంద్రబాబు మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో వారిద్దరి మధ్య వైరం మరింత పెరిగిపోయింది.

ఎప్పుడైతే ఆది మంత్రి అయ్యారో అప్పటి నుంచి సీఎం రమేష్ ప్రాబల్యం మసకబారడం మొదలైంది. పేరుకి చెప్పుకోవడానికి ఇద్దరూ కడప జిల్లావాళ్లే అయినా.. సీఎం రమేష్ కుటుంబం ఎప్పటి నుంచో చిత్తూరులో స్థిరపడ్డారు. దీంతో ఆది.. స్థానిక నేతగా అందరిలో గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఫ్యాక్షన్ నేపథ్యం కూడా ఉండటంతో జిల్లాలో ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు. నెమ్మదిగా జిల్లా యంత్రాంగాన్ని కూడా ఆది తన చేతిలోకి తెచ్చుకున్నాడు. చంద్రబాబు కూడా ఆదికే వత్తాసు పలుకుతున్నాడు.      

దీంతో జిల్లాలో ఎవరికి ఏ పని కావాలన్నా మంత్రి ఆది వద్దకే వస్తున్నారు. ఈ విషయంలో సీఎం రమేష్ కోపంతో రగిలిపోతున్నారు. జిల్లాలో తన పరిస్థితి ఏమీ బాగాలేదని తన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నట్లు సమాచారం.

click me!