
జనసేనాని సైన్యం కోసం ఎదురుచూస్తున్నాడు. సైన్యం సమకూరగానే ఆయన యుధ్దం మొదలవుతుంది. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఈ రోజు అమెరికాలో చెప్పారు.
తాను లక్ష్యంకోసం నిజాయితీగా పోరాడే శక్తి వంతమయిన యువకుల కోసం వెదుకుతున్నానని అంటూ ‘మీలాంటి వాళ్ల నాకు కావాలి, మీరు ముందుకు రావాలి’ అని తన ముందు కూర్చున్న వందలాది మందియువకులకు పిలుపునిచ్చారు.
దేశంలో యువకులంటే, రాజకీయనాయకుల కుటుంబాల వాళ్లే అనుకుంటున్నారని ఈ పరిస్థితి పోవాలని ఆయన జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ అన్నారు.
అమెరికా, న్యూహాంప్ షైర్ ,నషువాలలో అభిమానులు ఏర్పాటుచేసిన కార్యక్రమాలలో మాట్లాడుతూ ‘ యూత్ అంటే రాజకీయనాయకులు కొడుకులు మనవళ్లేనా... ఆ భావం పోవాలి. యువకులంటే మీరు.. మీరు ముందుకు రావాలి,’అని హర్షధ్వానాల మధ్య అన్నారు.
‘నాకు మీ కాంట్రిబ్యూషన్ కావాలి. మీలో నుంచి బలమయిన నాయకత్వం కావాలి. మీ ఆలోచనలు కావాలి,’ అని ఆయన అన్నారు.
చాలామంది పార్టీని విస్తరింపచేయాలని సలహా ఇస్తున్నారని చెబుతూ తాను నాయకత్వం లక్షణాలున్న యువకుల కోసం చూస్తున్నానని పవన్ చెప్పారు.
తాను ఆషా మాషిగా రాజకీయాలలోకి రావడం లేదని చెబుతూ దాదాపు పాతికేళ్లు ఆలోచించి, తపించి, రాజకీయాలలోకి రావాలని నిర్ణయంతీసుకున్నానని ఆయన అన్నారు.
రాజకీయం పవిత్ర వృత్తి అని చెబుతూ తనకు దెబ్బ కొట్టడం, దెబ్బతీయం బాగా తెలుసనని అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిమీద కోపం లేదు, అయితే, సమస్యలున్నపుడు చూస్తూ వూరుకునే మనిషిని కానని కూడా ఆయన హెచ్చరించారు.
జనసేన అంతిమ లక్ష్యం అధికారం కాదని సంక్షేమమని స్పష్టంగా చెప్పారు. ‘నేను సమస్యల మీదే ముందుకు వస్తున్నాను. అన్ని సమస్యలు అధికారంతో నే పరిష్కారం కావు,’అని అన్నారు.
జనసేన ఆయుధం ధైర్యమని, జాతీయ సమగ్రత లక్ష్యమని కూడా పవన్ ప్రకటించారు.
రాయప్రోలు సుబ్బారావు దేశభక్త గీతం ‘ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అన్న గేయం వల్లెవేస్తూ అమెరికా లో ఉన్న భారత దేశాన్ని మాతృదేశాన్ని మరవవద్దని ఆయన సలహ ఇచ్చారు. అందరిచేత
భారత్ మాతకు జై అని నినాదం ఇప్పించారు.