
కావూరి సాంబశివరావు (కె ఎస్ రావు) పేరు తెలుసుగదా. చాలా సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ టికెట్ మీద ఆరు సార్లు ఎంపి అయిన వ్యాపారవేత్త. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ వదిలేశారు. బిజెపిలో చేరారు.
బ్యాంకుకు డబ్బులు బకాయిపడిన వారిలో ఒకరు. ఆమధ్య బ్బాబ్బాబు మా బ్యాంకును ముంచొద్దని సిబ్బంది ఆయన ఇంటి ముందు ధర్నా చేశారు.
ఇపుడు ఆయన దెబ్బకు నర్సింగ్ కోర్సు చదువుతున్న అమ్మాయిలు రోడ్డున పడ్డారు. ఆయన నడిపించే మెడ్విన్ ఆసుప్రతి మూతపడటంతో అందులో నర్సింగ్ విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వీరంతా లక్షలు చెల్లించి సీటు తెచ్చకున్నారు. తమ బతులకు బజారు పాలు చేయవద్దని ఆస్పత్రి యాజమాన్యానికి వ్యతిరేకంగా ఇపుడు పోరాడుతున్నారు.
హాస్టల్ నుంచి తమని తరిమేసేందుకు రూమ్స్ కు కరెంట్ నిలిపేస్తున్నారని, గదులు తెరవడంలేదని, మెస్ సౌకర్యం లేక కొన్ని రోజులుగా పస్తులుంటూన్నామని, ప్రస్తుతం తమ వద్ద డబ్బులు కూడా లేవని ఈ అమ్మాయిలు ఆవేదన చెందుతున్నారు.
నిన్న 2 గంటల పాటు మాజీ ఎంపీ కావూరి సాంబశివరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అబిడ్స్ పోలీసులు ఆందోళన విరమించాలని విద్యార్థులకు కోరారు. యాజమాన్యంతో చర్చిస్తా మని పోలీసులు హామీ ఇచ్చినా కడుపు కాలుతున్న విద్యార్థినులు వెనక్కి తగ్గలేదు.దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రెచ్చిపోయిన విద్యార్థులు పోలీసులపై రాళ్లురువ్వారు. పరిస్థితి చేజారిపోవడంతో పోలీసులు లాఠీలకు పనిజెప్పారు.పత్రికల ఫొటోగ్రాఫర్లు సతీష్, సంజయ్‌చారితో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.
మూడు నెలలుగా పస్తులుంటున్నాం
ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించి మెడ్విన్ ఆస్పత్రిలో నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్నామని నర్సింగ్ విద్యార్థులు చెబుతున్నారు. 250 మంది వద్ద లక్షలు వసూలు చేసిన ఆస్పత్రి యాజమాన్యం ఇప్పుడు ఆస్పత్రిని, మెస్‌ను తెరవకుండా తమను రోడ్డు పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మాజీ ఎంపీ కావూరి కుమార్తెలు డైరెక్టర్లు. వ్యవహరిస్తూ తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు.