అప్పుడు ఠాగూర్ ... ఇప్పుడు కైలాష్

First Published Feb 7, 2017, 11:07 AM IST
Highlights

దొంగలకు, నోబెల్ కు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది.

దేశంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్.. సాహిత్యంలో ఆయనకు ఈ అవార్డు వచ్చింది. అయితే ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డును ఆయన తన సొంతం అనుకోలేదు. జాతి సంపదగా భావించారు.

 

అందుకే దాన్ని తాను పెంచి పోషించిన  శాంతినికేతన్ విశ్వవిద్యాలయానికి అప్పగించారు.

 

కానీ, ఆ అవార్డు అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయింది. కొందరు దొంగలు విశ్వవిద్యాలయంలోని మ్యూజియంలోకి చొరబడి దాన్ని ఎత్తుకెళ్లారు.

 

చాలా కాలం తర్వాత  భారత్ తరఫున కైలాష్‌ సత్యార్థి మరోసారి నోబెల్ అవార్డును పొందారు. ఈయన కూడా అవార్డును తన సొంతం అనుకోలేదు. జాతి సంపదగా భావించారు.

 

అందుకే తన అవార్డును రాష్ట్రపతిభవన్ కి ఇచ్చేశారు. దేశ ప్రజలంతా దాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పించారు. అయితే తనకొచ్చిన నోబెల్ పతకం నమూనాను మాత్రం తన నివాసంలో ఉంచుకున్నారు.

 

చరిత్ర మరోసారి రిపీట్ అయింది.

 

సోమవారం రాత్రి ఢిల్లీలోని ఆయన నివాసంలో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న పలు విలువైన వస్తువులతో పాటు నోబెల్‌ బహుమతి నమూనాను కూడా ఎత్తుకెళ్లారు. సత్యార్థి కుమారుడు దీనిపై స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

 

అయితే జరిగిన ఘటనపై కైలాష్ సత్యార్థి స్పందిస్తూ... తన నివాసంలో చోరీకి గురైంది నోబెల్ పతకం నమూనా మాత్రమేనని అసలైన నోబెల్ ను  రాష్ట్రపతి భవన్ కి గతంలో ఇచ్చి వేసినట్లు గుర్తు చేశారు.

 

కాగా, ‘బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌’ పేరిట బాలల హక్కులపై ఉద్యమించినందుకుగాను 2014 లో పాకిస్తాన్ బాలిక మాలాలతో కలసి సత్యార్థికి నోబెల్ బహుమతి వచ్చిన విషయం తెలిసిందే.

click me!