
ఈ ఏడాది నోబెల్ అవార్డుల ప్రకటన సోమవారం మొదలైంది. తొలుత వైద్యరంగానికి నోబెల్ బహుమతులు ప్రకటించారు. ఈ రంగంలో ముగ్గురు శాస్త్రవేత్తలు నోబెల్ పురస్కారం పంచుకుంటారు. జెఫ్రీ సి.హాల్ (72), హైకెల్ రోస్ బాష్ (73), మైకెల్ డబ్ల్యూ యంగ్ (68)కు నోబెల్ అవార్డు అందిస్తున్నట్లు నోబెల్ అవార్డుల కమిటీ ప్రకటించింది. వీరంతా ప్రాణుల బయలాజికల్ క్లాక్ గురించి పరిశోధనలు చేశారు. ఈ బయోలాజికల్ క్లాక్ యే ప్రాణులు ఎపుడు విశ్రమించాలి, దేహంలో ఏ హార్మోన్లు ఎపుడు విడుదల కావాలి, దేహ ఉష్ణోగ్రత ఎంత ఉండాలి వగైరాలను నిర్ణయిస్తుంది. మనలోపలి గడియారం, బయటి ప్రపంచంలో వచ్చే మార్పుల మధ్య లంకె తెగిపోయినపుడు సమస్య వస్తుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణం తర్వాత వచ్చే జెట్ లాగ్ ఈ లంకె తెగిపోవడం వల్ల సంభవించేదే.ఈ జీవవ్యాపారాలను ప్రభావితం చేసే జీన్ నొకదాన్ని వీరు ఫ్రూట్ ఫ్లై నుంచి విడదీయడంలో విజయవంతమయ్యారు.
అయితే, ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని అక్టోబర్ 5 న ప్రకటించనున్నట్లు ఈ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది సాహిత్యంలో బహుమతిని అమెరికావాగ్గేయకారుడు బాబ్ డిలాన్ కు లభించిన సంగతి తెలిసిందే. ఈ సారి నోబెల్ అవార్డు విలువ 9 మిలియన్ క్రోనర్లుఅంటే దాదాపు 1.1 మిలియన్ అమెరికన్ డాలర్లకు సమానం.