
ప్రముఖ అమెరికన్ డాన్ బ్రౌన్ రాసిన నూతన పుస్తకం ‘‘ఆరిజిన్’’ అనే పుస్తకం మంగళవారం భారత మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. థ్రిల్లర్ ఫిక్షన్ కథలు రాయడంలో బ్రౌన్ సుప్రసిద్ధుడు. కేవలం భారత మార్కెట్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బ్రౌన్ ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. ఆయన రాసిన పుస్తకాలకు భారత్ లో చాలా మంది అభిమానులు ఉన్నారు. అందుచేత తన నూతన పుస్తకాన్ని కూడా భారత్ లో విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారు.
అయితే.. గతంలో ఆయన రాసిన పుస్తకాలు ‘ ద డ విన్సీ కోడ్,’ ‘ఏంజెల్స్ అండ్ డీమాన్స్’, ‘ ద లాస్ట్ సింబల్’, ‘ ఇన్షర్ నో’, ‘ డిజిటల్ ఫర్ ట్రెస్’ వంటి పుస్తకాలను పైరేట్ చేశారు. దీంతో.. ఈ సారి అలా జరగకుండా ఉండేందుకు పబ్లిషర్స్ ఓ ప్రచారాన్ని ప్రారంభించారు. పైరేటెడ్ పుస్తకాలను అమ్మకుండా ఉండేందుకు వారు ఈ వినూత్న ప్రచారాన్ని చేపట్టారు. పైరేటెడ్ వర్షన్ కాకుండా అసలు కాపీని ప్రజలు చదివేలా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు ప్రత్యేకంగా ఒక ఈమెయిల్ ఐడీని కూడా రూపొందించారు.
డాన్ బ్రౌన్ కి భారత్ లో అభిమానులు ఎక్కవ మంది ఉన్నారని పబ్లిషర్ బిల్ స్కాట్ చెప్పారు. 2015లో ఒకసారి బ్రౌన్ ఇండియా వచ్చినప్పుడు ఆయనకు లభించిన ఆదరణే ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో బ్రౌన్ రాసిన పుస్తకాలకంటే ఈ పుస్తకం భారత్ లో రికార్డు స్థాయిలో అమ్ముడౌతుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు.