
కలలు కనడం మానవ సహజం. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికీ కలలు వస్తుంటాయి. మనిషి మానసిక ప్రతిరూపాలే కలలుగా చెబుతంటారు. పడుకునేటప్పుడు సంతోషంగా ఉంటే ఒకలా, విషాదంగా ఉంటే మరోలా కలలు వస్తుంటాయి. చాలా మంది తమ నిజ జీవితంలో చేయలేనివన్నీ.. కలల్లో నిజం చేసుకుంటారు. అందుకే చాలా మందికి కలలు అంటే చాలా ఇష్టం కూడా. అలాంటి కలలు.. ఒక్కసారిగా రావడం ఆగిపోతే? రోజూ నిద్రపట్టగానే వచ్చి.. మనల్ని మరో ప్రపంచంలో తేలియాడేలా చేసే కలలు.. అసలు రావడం ఆగిపోతే.? ఇది కూడా ఒక ఆరోగ్య సమస్యే అంటున్నారు నిపుణులు.
ప్రతి రోజూ వచ్చే కలలు రావడం ఆగిపోయాయంటే.. అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్లే నని చెబుతున్నారు నిపుణులు, నిద్రలేమి, డిప్రెషన్ లాంటి సమస్యలు కూడా ఎదురౌతాయట. ఇందుకు చాలా కారణాలే ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా మంచి నిద్రలో ఉండగా.. అర్థరాత్రి సమయంలో లేదా.. తెల్లవారు జామున ఈ కలలు అనేవి వస్తాయట. సరైన నిద్ర లేకపోయినా.. ఈ సమస్య తలెత్తుందని వారు చెబుతున్నారు. ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్( ఆర్ ఈఎం), నాన్- ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్( నాన్ ఆర్ ఈఎం)ల ఆధారంగా మనకు కలలు ఎలా వస్తాయనేది పరిగణిస్తారు.
మనం ఎప్పుడైతే సరైన నిద్రని కోల్పోతామో.. అప్పుడు కలలను కూడా కోల్పోతామని అరిజోనా యూనివర్శిటీ ప్రొఫెసర్ రూబిన్ చెప్పారు. ఈ అంశంపై ఆయన పరిశోధనలు జరిపారు. దీనిపై న్యూయార్క్ అకాడమీ ఆఫ్ సైన్స్ లో కథనం కూడా ప్రచురితమైంది. నిద్రలేమి, లైఫ్ స్టైల్ లో మార్పులు, బిహేవియర్ లో మార్పులు ఇవన్నీ.. కలలు మాయమవ్వడానికి కారణమౌతాయని రూబిన్ తెలిపారు.