
వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య రాసిన ‘ కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు’ అనే పుస్తకం తెలంగాణలో రెండు వర్గాల మధ్య వివాదానికి తెరతీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో ఆ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ముందుగానే బ్యాన్ చేశారు. అంతటి వివాదం రేపిన పుస్తకాన్ని రాసిన ఆయనకు విజయవాడలో సన్మాన సభ ఏర్పాటు చేయాలని భావించారు ఆయన వర్గీయులు. దీంతో ఉలిక్కి పడిన ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో అప్రమత్తమైంది.
కంచ ఐలయ్య సన్మాన సభ అనుమతిని నిరాకరించారు. విజయవాడలోని జేఏసీ జింఖానా గ్రౌండ్స్ లో ఐలయ్యను సన్మానించాలని ఆయన వర్గీయులు భావించారు. అందుకోసం ఈ నెల 28న సభ నిర్వహణకు అనుమతి కావాలంటూ సామాజిక ఉద్యమ జేఏసీ నగర కమిషనర్ కు దరఖాస్తు చేసుకుంది. పోటా పోటీగా అదే రోజు ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాలు కూడా అదే గ్రౌండ్స్ లో సభలు నిర్వహించాలని అధికారులను అనుమతి కోరారు.
ఇరువర్గాల దరఖాస్తులను నగర పోలీసులు పరిశీలిస్తుండగా శాంతిభధ్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఇరువర్గాల సభలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అంతేకాకుండా జింఖానా గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ 144 సెక్షన్ రేపటి నుంచి ఈనెల 28వ తేదీ వరకు అమలు కానుంది.
ఐలయ్య రాసిన ‘ కోమటోళ్లు.. సామాజిక స్మగ్లర్లు’ అనే పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో వివాదం రేపిన సంగతి తెలిసిందే.