
సినీనటుడు కమల్ హాసన్.. పాదయాత్ర చేయనున్నాడా? ఆయన మాటలు వింటుంటే అదే నిజమనిపిస్తోంది. మంగళవారం కమల్ 63వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ..తాను త్వరలోనే తమిళనాడు వ్యాప్తంగా పర్యటించనున్నట్లు తాజాగా కమల్ ప్రకటించారు. దీంతో.. ఆయన పాదయాత్ర చేయనున్నారంటూ తమిళనాట చర్చలు మొదలయ్యాయి. రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షనేత పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన బాటలోనే కమల్ కూడా పాదయాత్ర చేయనున్నారనే వాదనలు వినపడుతున్నాయి.
అంతేకాకుండా కమల్ హాసన్.. రాజకీయ ప్రవేశంపై నెలకొన్న సంక్షోభానికి కూడా ఆయన తెర లేపారు. ఆయన రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించిన నాటి నుంచి.. నిజంగా వస్తారా? రారా ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. వాటిని పటాపంచల్ చేస్తూ.. తాను రాజకీయాల్లోకి రావడం గ్యారెంటీ అని చెప్పేశాడు కమల్. ఇందుకు మంగళవారం తాను ఏర్పాటు చేసిన సభే నిదర్శనమన్నారు.
ఇదిలా ఉండగా.. తన పుట్టిన రోజు సందర్భంగా ‘మయ్యం విజిల్’ అనే యాప్ ని విడుదల చేస్తున్నట్లు కమల్ చెప్పారు. ఈ యాప్ కేవలం ప్రజల కోసమేనని స్పష్టం చేశారు. ఈ యాప్ సహాయంతో ప్రజల సమస్యలను తాను నేరుగా తెలుసుకుంటానని కమల్ పేర్కొన్నారు. అయితే.. ప్రస్తుతం ఈ యాప్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉందని.. వచ్చే ఏడాది జనవరి కల్లా పూర్తి చేస్తామని తెలిపారు.
అంతేకాకుండా తాను త్వరలోనే తమిళనాడు వ్యాప్తంగా పర్యటించనున్నట్లు కమల్ పేర్కొన్నారు. తమిళనాడుని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన కల అని ఆయన చెప్పుకొచ్చారు. తన పుట్టిన రోజునాడు.. పార్టీ పేరును ప్రకటిస్తానని వార్తలు వెలువడుతున్నాయని.. అందులో నిజం లేదని చెప్పారు. పార్టీ పేరు ప్రకటించడానికి ఇంకా సమయం ఉందన్నారు. గతంలో అవినీతికి పాల్పడిన వారికి తన పార్టీలో చేర్చుకోనని చెప్పారు. తాను హిందు వ్యతిరేకిని కాదని ,హిందువులను కించపరిచాలనే భావన కూడా తనలో లేదని స్పష్టం చేశారు.