
టాస్క్ ఫోర్స్ బాంబు దాడి ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. 12ఏళ్ల క్రితం బేగంపేటలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయం లక్ష్యంగా మానవ బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈకేసులో పలువురిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. పుష్కర కాలం తర్వాత .. సరైన సాక్ష్యాలు లేని కారణంగా వారిని నిర్ధోషులుగా పరిగణిస్తూ గురువారం న్యాయస్థానం తీర్పు చెప్పింది.
ఈ ఘటనపై అసదుద్దీన్ ఘాటుగా స్పందించారు. 12ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించి వారు కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వగలరా అంటూ ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఎలాంటి తప్పు చేయకపోయినా వారు జైలు జీవితాన్ని అనుభవించారని ఆయన అన్నారు. దీనికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు నిందితులుగా పేర్కొన్న వారి తరఫున వాదించిన న్యాయవాదులకు ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.