
చేయని నేరానికి.. 12ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు.. తన కుటుంబానికి , కట్టుకున్న భార్యకు దూరం అయ్యాడు. జైలు శిక్షతోపాటు.. ఉగ్రవాది అనే ముద్ర కూడా పడింది. పుష్కర కాలం గడిచిన తర్వాత ఎట్టకేలకు నిర్దోషిగా బయటకు వచ్చాడు. చానాళ్ల తర్వాత స్వేచ్ఛా వాయువును పీల్చకున్న కలీమ్.. హైదరాబాద్ లో జరిగిన తొలి మానవబాంబు దాడి ఘటనలో ప్రధాన నిందితుడు.
వివరాల్లోకి వెళితే..అది అక్టోబర్ 12, 2005 తొలిసారిగా భాగ్యనగరంలో మానవబాంబు దాడి జరిగింది. బేగంపేటలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయం లక్ష్యంగా ఈ దాడి జరిగింది. జరిగిందేమిటో తెలియక ఒక్కసారిగా రాజధాని ఉలికిపడింది.. సీన్ కట్ చేస్తే.. ఘటన జరిగిన కొద్ది రోజులకే నిందితులుగా పేర్కొంటూ.. పలువురిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో కలీమ్ ఒకడు. ఈ ఘటన జరిగి పుష్కర కాలమయ్యింది. కాగా సంవత్సరాలపాటు సాగిన ఈ కేసులో పూర్తిస్థాయి సాక్ష్యాధారాలు లేని కారణంగా గురువారం న్యాయస్థానం నిందితులను విడుదల చేస్తూ తీర్పు చెప్పింది. అసలు దోషులెవరనేది మాత్రం అల్లాకే తెలియాలి.
నిర్దోషులుగా విడుదలైన వారి అందరి సంగతి ఎలా ఉన్నా.. ఈ కలీమ్ కథ మాత్రం వేరు.. పోలీసులు అరెస్టు చేసిన ప్పుడు కలీమ్ వయసు 23 సంవత్సరాలు. అప్పటి ఆయనకు వివాహమై ఎంతో కాలం కాలేదు. అంబర్ పేటలో ఓ వెల్డర్ గా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అనుకోకుండా రాజధానిలో జరిగిన బాంబు దాడిలో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక తాను ఈ కేసు నుంచి బయటకు రానని భావించిన కలీమ్.. తన భార్యను వేరే వివాహం చేసుకోవాల్సిందిగా సూచించాడు. వారిద్దరూ కలిసి జీవించింది కూడా చాలా కొద్ది కాలమేనని కలీమ్ తరపు బంధువులు చెబుతున్నారు. భర్త సూచన మేరకు ఆమె మారు మాట్లాడకుండా వేరే వివాహం చేసుకుంది. కలీమ్ ఎలాంటి నేరం చేయకపోయినా విలువైన జీవితాన్ని కోల్పోయాడంటూ అతని కుటుంబసభ్యలు ఆవేదన వ్యక్తం చేశారు. 35ఏళ్ల కలీమ్ ఇక ఇప్పుడు ఏమి చేస్తాడో చూడాలి.