
నవభారతం ఆవిష్కరణకు గడువు దగ్గర పడుతుండటంతో ప్రధానమంత్రిలో ఆందోళన పెరిగిపోతోంది. నోట్ల రద్దు సమస్యను ఒంటరిగా ఎదుర్కోవాల్సి రావటంతో ఒత్తిడి మరీ ఎక్కువైపోతున్నట్లుంది. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత 50 రోజులు త్యాగాలు చేస్తే నవభారతాన్ని ఆవష్కరిస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు.
మోడి కోరినట్లే ప్రజలందరూ ఎంతటి కష్టానైనా ఓర్చుకుంటున్నారు. ప్రధాని చెప్పిన 50 రోజులు గడువు, నవభారతం ఆవిష్కరణ తేదీ డిసెంబర్ 30వ తేదీతో పూర్తవుతోంది. ఆ గడువే మోడి పాలిట పెనుభూతమై మెడకు చుట్టుకునేట్లు కనబడుతోంది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత మోడి ఊహించని రీతిలో దేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్ధ దాదాపు కుదేలైపోయింది. అసంఘటిత రంగంలోని కోట్లాది మంది రోడ్డున పడ్డారు. వర్తక, వాణిజ్యాలు పడకేసాయి. రియల్ ఎస్టేట్, రవాణా, వ్యవసాయ, సహకార, పారిశ్రామికరంగాలు దెబ్బతిన్నాయి.
పెద్ద నోట్లరద్దు సందర్భంగా మోడి ఏవైతే చెప్పారో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. డబ్బుల కోసం క్యూలైన్లలో నిలబడి సుమారు 115 మృతిచెందారు. మోడి నిర్ణయానికి వ్యతిరేకంగా జాతీయ స్ధాయిలోని విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడుతున్నాయి. దాంతో పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిణామాలు మోడిని దాదాపు ఒంటరిని చేసాయి.
ప్రజాగ్రహాన్ని గమనించిన తర్వాత భాజపాలో నేతలు కూడా మోడికి అండగా నిలబడలేదు. సోషల్ మీడియాలో మోడి నిర్ణయంపై విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే, నాలుగు రోజులు గడవగానే పరిస్ధితి తల్లక్రిందులవటం మొదలైంది.
వారం గడచిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం కట్టలు తెంచుకున్నది. ఓవైపు ప్రజాగ్రహం, మీడియా, నిపుణుల విశ్లేషణలతో ప్రధానిలో కలవరం మొదలైంది. దాంతో నెల రోజుల పాటు జరిగిన పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడటానికే భయపడ్డారు.
దేశంలో పరిస్ధితులు తనకు ఎదురుతిరుగుతున్నట్లు ప్రధాని గ్రహించారు. అదే సమయంలో పార్టీ, ప్రభుత్వం, ప్రజలు, విపక్షాలు, మెజారిటీ మీడియాలో వ్యతిరేకతను గమనించారు. దాంతో దిక్కుతోచని మోడి పెద్ద నోట్ల రద్దుపై రోజుకో మాట మాట్లాడటం మొదలుపెట్టారు.
పార్టీ వేదికలపై సీనియర్లు కూడా తమ నిరసన గళాన్ని వినిపించటం మొదలుపెట్టారు. చివరకు మిత్రపక్షాలు కూడా మోడికి మద్దతుగా నిలవకపోవటం గమనార్హం. రోజుకో నిబంధనను తెరపైకి తెస్తూ ఆర్బిఐ కూడా ప్రజల్లో గందరగోళానికి కారణమవుతోంది.
ప్రధాని చెప్పిన 50 రోజుల త్యాగాలన్న మాటతోనే ప్రజలు సహనంతో వేచి చూస్తున్నారు. అయితే, మోడి చెప్పిన నవభారతంపై ఎవరికీ నమ్మకాలు లేవు. ఎందుకంటే, గడచిన 40 రోజుల్లో జరగని అద్భుతం మరో తొమ్మిది రోజుల్లో జరుగుతుందని ఎవరూ అనుకోవటం లేదు. ఆ తర్వాత దేశంలో పరిస్ధితులు ఏ రీతిగా ఉంటాయో అర్ధం కావటం లేదు.