
టీడీపీ ప్రభుత్వంలో భజన నేతలు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వారి పొగడ్తలకు అంతూ పొంతు లేకుండా పోతోంది. సీఎం చంద్రబాబు అంటే వారికి అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ.. ఆ అభిమానానంతటినీ అసెంబ్లీలో చూపించాల్సిన అవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. శుక్రవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలను వ్యతిరేకిస్తూ సమావేశాలను వైసీపీ నేతలు బహిష్కరించారు. దీంతో మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలు మాత్రమే సమావేశాలకు హాజరయ్యారు.
అయితే.. ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేతలు రాలేదు కదా అని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించేశారు. ఇక ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అయితే.. మరో మెట్టు పైకి ఎక్కారు. ఏకంగా చంద్రబాబుకి శ్రీకృష్ణ దేవరాయులుతో పోల్చారు. వీళ్ల తీరు చూస్తుంటే.. మరికొద్దిరోజుల తర్వాత అసలు శ్రీకృష్ణ దేవరాయులు కన్నా చంద్రబాబే గొప్ప అని చెబుతారేమో అనిపిస్తోంది.
వీళ్ల పొగడ్తలను విని.. ప్రజలు విమర్శిస్తున్నారా లేదా అన్న విషయాన్ని పక్కనపెడితే.. మిత్రపక్ష నేతలు మాత్రం విసిగిపోతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలను బహిరంగంగానే విమర్శించారు. ‘ భజన ఓ మోస్తారుగా ఉంటే వినసంపుగా ఉంటుంది, అదికాస్తా శృతి మించితే చెవులు నొప్పులు వస్తాయి’ అంటూ పేర్కొన్నారు. ఆయన ఒక్కరి మాట వింటే సరిపోతుంది.. భజన కార్యక్రమాలు ఏ రేంజ్ లో సాగుతున్నాయో. 2019 ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. దీంతో పొగడకపోతే వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వరేమో అన్న భయం పట్టుకున్నట్టుంది. అందుకే శృతి మించి మరీ వాయించేస్తున్నారు.