
సెంటీ మీటర్ చనువిస్తే కిలోమీటరు దూసుకెళ్లడంలో కొన్ని మీడియా సంస్థలు పీహెచ్ డీలు చేసేశాయి. వ్యాఖ్యలకు వక్రీకరణలు చోడించి జనాలను ఎగదోయడమే నయా జర్నలిజం. దీనికి కొన్ని టీవీ గొట్టాలు బ్రాండ్ అంబాసిడర్ లుగా వెలుగొందుతున్నాయి.
ఇటీవల చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనంలో ఓ కులాన్ని కించపరుస్తూ మాట్లాడారని కొన్ని టీవీ చానెళ్లు ఊదరగొట్టాయి. దీంతో సదరు కులస్తులు పోలీసు స్టేషన్ లలో కేసులు కూడా పెట్టారు.
అయితే తన వ్యాఖ్యలపై చాగంటి ఫుల్ క్లారిటీ ఇవ్వడం, దాంతో ఆ కుల సంఘాల నేతలు వెనక్కి తగ్గడం జరింగింది.
చాగంటి కోటేశ్వరరావుపై రాయదుర్గం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తెలంగాణ యాదవ సంఘం అధ్యక్షుడు దూదిమెట్ల సోమేశ్ యాదవ్ కేసును వెనక్కి కూడా తీసుకున్నారు.
అయితే చాగంటి ప్రవచనం కంటే ఆయన ప్రవచనంలోని వ్యాఖ్యలను వక్రీకరించి రాద్దాంతం చేసిన మీడియా సంస్థలు మాత్రం ఈ వివాదాన్ని వదలడం లేదు. దీంతో కొందరు ఆ మీడియా సంస్థలపై కూడా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
గత రెండు రోజులుగా కొన్ని చానెళ్లకు చాగంటి ప్రవచనమే తాజా సరుకుగా మారింది. ఇటు కుల సంఘాలను, అటు బాబాలను స్టూడియోకి కూర్చొబెట్టి ప్రవచనంలోనూ పికడలను ఏరడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇదు ఇప్పుడు చాగంటి అభిమానులకే కాకుండా సదరు కులస్తులకు కూడా ఆగ్రహం తెప్పిస్తోంది.