విచిత్రం : సూర్యదేవాలయంగా మారిన రామాలయం

Published : Jun 03, 2017, 12:46 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
విచిత్రం : సూర్యదేవాలయంగా మారిన  రామాలయం

సారాంశం

బూదగవి ఆలయంలో శతాబ్దాల పాటు పూజలందుకున్న విగ్రహం శ్రీరామచంద్రమూర్తిది కాదని, సూర్యనారాయణుడిదని ఈ మధ్యే వెల్లడయింది.  ఉన్నట్లుండి రామాలయం సూర్యదేవళమయిన వింత ఇక్కడ జరిగింది. అనుకోకుండా ఈ వూరొచ్చిన పురాతత్వ నిపుణులు, రామాలయం సందర్శించి, ఈ విగ్రహం రాములవారిది కాదని, సూర్యనారాయణుడిదని చెప్పడంతో  బూదగవి దేవాలయానికి  కొత్త అధ్యాయం మొదలయింది.

అనంతపురం - బళ్లారి మార్గంలో ఉరవకొండ పట్టణం దాటిన తరువాత దాదాపు పది కిలోమీటర్ల తరువాత బూదగవి అనే గ్రామం ఉంది.

 

ఆ బూదగవిలో అందమైన హనుమంతరాయుడు దక్షిణముఖంగా కొలువైయున్నాడు. 

ఆ గుడి పక్కనే మరొకగుడి ఉంది.  ఆ గుడిలో దక్షిణముఖంగా దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న స్వామివారున్నారు. ఆయన బాహుయుగళధృతముకుళితకమలుడైనప్పటికీ, ఇరువైపులా ఇరువురు దేవేరులు ఉన్నప్పటికీ, విచిత్రంగా బూదగవిగ్రామప్రజలు ఆయనను హనుమంతుని స్వామి అయిన శ్రీరామచంద్రునిగానే భావించి అలాగే శతాబ్దాలతరబడి కొలిచారు.  స్త్రీమూర్తులుగా స్పష్టమైన లక్షణాలు కనబడుతున్నప్పటికీ వారిని సీతాలక్ష్మణులుగా భావించారేమో.  గుడిని ఎవరైనా పెద్దలు, స్వాములు, ఆగమశాస్త్రవేత్తలూ దర్శించారో లేదో - దర్శించినప్పటికీ, "ఇదేమయ్యా? కోదండధారికానివాడు శ్రీరాముడేమిటి? లక్ష్మణుడు స్త్రీరూపశోభితుడై ఉండటమేమిటి?" అని అడగలేదేమో.  లేదా, సహస్రనామయశస్వి అయిన ఆ పరమాత్మునికి సహస్రరూపాలుండటంలో పెద్ద ఆశ్చర్యమేమిటని మిన్నకున్నారో?  అలా తెలిసినవారూ తెలియనివారూ కూడా తనను శ్రీరామచంద్రమూర్తి అని ఆరాధిస్తూ ఉండగా ఆ స్వామివారు కూడా ఎన్నడూ ఎటువంటి అభ్యంతరమూ తెలుపకుండానే హాయిగా అన్నివిధాలపూజలనూ అంగీకరిస్తూ ఉండిపోయారు.

 

ఇలా ఉండగా 2011 సంవత్సరంలో కొందరు పురాతత్త్వశాస్త్రవేత్తలు తమ విధినిర్వహణలో భాగంగా ఈ గుడికి వచ్చారు.  అన్నీ తెలిసినప్పటికీ మౌనం వహించే పండితులకుండే ఓర్పు, మొగమాటం కాని, అమాయికగ్రామప్రజలకు ఉండే భయభక్తుల్లాంటివి గాని వారికి బొత్తిగా లేవేమో మరి!  వారు ఆ మూర్తిని చూసేసరికి, "భలేవారయ్యా!  ఈయన శ్రీరామచంద్రమూర్తి కారు, శ్రీసూర్యనారాయణమూర్తి సుమా!  కావాలంటే చూసుకోండి!  ఈయన విగ్రహం అచ్చం ఉత్తరాంధ్ర లో శ్రీకాకుళం హర్షవల్లి  (అరసవెల్లి) గ్రామంలోని శ్రీసూర్యనారాయణుని విగ్రహం లాగానే ఉంది అని నిరూపించేశారు.  వారి మాటలను పరిసరాలలోని ఆనాగరకజానపదమూ, ఆబాలగోపాలమూ ఎటువంటి అనిష్టం అనాదరమూ లేకుండా సంభ్రమాశ్చర్యాలతో త్రికరణశుద్ధిగా ఆమోదించేశారు.

 

 

అప్పటివరకు శ్రీసీతాలక్ష్మణసమేతశ్రీరామచంద్రమూర్తిగా చలామణి అయిన స్వామివారు ఆనాటినుండి ఉషాఛాయాసమేత శ్రీసూర్యనారాయణస్వామివారిగా పూజలందుకొనడం ప్రారంభించారు.  జనాలు శ్రీస్వామివారిముందు అనూరచోద్యమానసప్తాశ్వాలను కూడా జోడించి మూర్తికి మరింత అందం సమకూర్చిపెట్టారు.  రథసప్తమినాడు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి.

 

ఈ ఆలయం 800 సంవత్సరాలక్రితం చోళరాజులు నిర్మించిందని యువకుడైన అర్చకస్వామి తెలియజేశారు.  ఆ రాజు పేరేమిటో - అది తెలియదట.  గుడి స్తంభాలను చూస్తే మాత్రం విజయనగరశైలి తొణికిసలాడుతోంది.  ఏదేమైనా దేవాలయపు పురాతన ప్రతిపత్తికి ఎటువంటి భంగమూ కలుగదు.  అయినప్పటికీ,  ప్రభుత్వదేవాదాయశాఖ ఈ దేవాలయాన్ని స్వాధీనం చేసుకొనేందుకు నిరాకరించింది.  కారణాలు చాల చిన్నవి.  1 ఈ దేవాలయం పేరిట పెద్ద ఆస్తులు లేకపోవడం.  2 ఈ దేవాలయానికి పెద్ద మొత్తంలో ఆదాయం లేకపోవడం.  గ్రామప్రజలు, అర్చకులే ఈ దేవాలయనిర్వహణను అతి కష్టం మీద చేసుకొస్తున్నారు.

 

యావద్భారతదేశంలో దక్షిణాభిముఖుడైన సూర్యుని దేవళం ఇదొక్కటేనని అర్చకులు తెలియజేశారు.

 

ఇంతా చేస్తే ఈ దేవాలయంలో ప్రధాన దేవత శివుడు.  పూర్వాభిముఖుడై లింగరూపంలో పూజింపబడుతున్న ఈ స్వామివారి పేరు శ్రీరామలింగేశ్వరుడు. ఇక్కడి మునుపటి రాముడు కాస్త సూర్యుడైనాడు కాబట్టి ఇపుడు శ్రీరామలింగేశ్వరుడు కూడా శ్రీసూర్యలింగేశ్వరుడు కావాలి కదా అని మనం తర్కించవచ్చు గాని, ఆ పేరును అలాగే వదిలేస్తే పైన పేర్కొన్న పూర్వచరిత్ర కాస్త "నామమాత్రంగా" మిగిలి ఉండే అవకాశం ఉంటుంది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !