
మాజీ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన సర్వే సరదాను వదులు కోలేదు.బహుశా జనం ఆయన్ను సీరియస్ గా తీసుకొనకపోయినా, ఆయన సర్వే ఫలితాలను మాత్రం యమసీరియస్ గా తీసుకుంటారు.
అందుకే రాజకీయాలను మాట్లాడటం మానేసి దాదాపు మూడేళ్లవుతున్నా,రాజకీయ సర్వేలను వదులుకోలేదు. తాజాగా ఆయన చాలా ఆసక్తి రెకెత్తిస్తున్న నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల గాలి మీద సర్వే చేయించారని చెబుతున్నారు. సర్వేలో వైసిసి గెలుపొందుతున్నట్లు వెల్లడయిందని ఆయన సన్నిహితుడొకరు ఏసియానెట్ కు వెల్లడించారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ గెలవడం జరుగుతుందనే విషయాన్ని లగడ పాటి కొంత మంది సన్నిహితులతో షేర్ చేసుకున్నట్లు ఆయన చెప్పారు.సాధారణంగా బోళా గా ఉండే లగడపాటి నంద్యాల ఉప ఎన్నిక సర్వే విషయంలో మాత్రం సమాచారం వెల్లడించడం లేదు.ఇపుడు ఎన్నికల ఫలితమెలా ఉంటుందో చెప్పి తన రాజకీయ పున: ప్రవేశాన్ని చెడగొట్టుకోదలచుకోలేదేమో.
నంద్యాల మీద రాష్ట్ర మంతా అసక్తి కలగడానికి కారణాలు:
తొలిసారి ఫిరాయింపు నియోజకవర్గంలో ఉప ఎన్నికల జరుగుతూ ఉండటం,మూడేళ్ల చంద్రబాబు పరిపాలన తర్వాత ఇది రెఫరెండం గా చాలా మంది భావిస్తూ ఉండటం,చంద్రబాబు సంతకాలు చేసిన ఎమ్వోయులు, ఉద్యోగాల హామీలు, అమరావతి నిర్మాణం, వగైరాల మీద రాయలసీమ ప్రజలెలా స్పందిస్తారనే ఆసక్తి.
ఇలాంటపుడు వైసిపి పార్టీ గెలుస్తుందని రాజగోపాల్ సర్వే చెప్పిందని ఆయన సన్నిహితులే ప్రచారం చేస్తున్నారు.
అయితే, ఇంత జరగుతున్నా లగడపాటి నోరు మెదపడం లేదు. ఆయననుంచి ఎలాంటి ఖండన గాని వివరణ గాని లేదు.