కెసిఆర్ కు, చంద్రబాబుకు ఒకే రకం ‘తలనొప్పి’

First Published Nov 25, 2017, 12:27 PM IST
Highlights

యాదాద్రి ప్రోగ్రెస్ మీద కెసిఆర్ నారాజయితే, పోలవరం  మీద చంద్రబాబు గరం గరం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వచ్చిన తలనొప్పే వచ్చింది.  ఇద్దరి ప్రయారిటీలు ఒకటే. రెండు చోట్ల ప్రజల కంటికి స్పష్టంగా కనిపించే ప్రతిష్టాత్మక  ప్రాజక్టులను 2019 నాటికి పూర్తిచేసి మళ్లీ అధికారంలోకి రావాలన్నదే ప్రయారిటీ. అందుకే ఇద్దరికీ ఒక రకం సమస్యలొచ్చాయి. ఇద్దరు ఒకే రకం భాషలో ఆగ్రహం వెలిబుచ్చారు.  ఆంధ్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం విషయంలో కాంట్రాక్టర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి  యాదాద్రి ప్రాజక్టు మీద మండిపడ్డారు, ఇలా.

 

‘‘యాదాద్రి ఆలయ పనులు పూర్తి కావడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుంది? అన్ని పనులూ అసంపూర్తిగానే ఉన్నాయని నిన్న కెసిఆర్ మండిపడ్డారు. నిన్న యాదాద్రి సందర్శించి కెసిఆర్ అక్కడి పనులను పరిశీలించారు.

నిజానికి, ఇది చంద్రబాబు పోలవరం రివ్యూ మీటింగులో ప్రతిసోమవారం అనేమాట. ఆయన పిఆర్ ఒలు  సోమవారాన్ని ‘పోలవారం’ అని ముద్దుగా పిలిచి,  ముఖ్యమంత్రి స్వయంగా రివ్యూచేస్తున్నాడు కాబట్టి 2018 కల్లా ప్రాజక్టు పూర్తవుతుందని ఏడాది కిందట ప్రచారం చేశారు. అయిదారు నెలలు గడిచాయో లేదో చంద్రబాబు నాయుడి భాష మారిపోయింది. పోలవారం ‘గోలవారం’ అయిపోయింది.

కాంట్రాక్టర్ పనులు చేయడం లేదని, చర్యలు తీసుకోండి, అవసరమయితే కాంట్రాక్టర్ ను మార్చేద్దాం అనడం మొదలుపెట్టారు. ‘మీ చేత కాకపోతే, పోండి,’ అనేవారు.

నిన్న యాదాద్రి రివ్యూలో కూడా  కెసిఆర్ ఇలాంటి భాషే ప్రయోగించారు.

ఆంధ్రజ్యోతి కథనం  ప్రకారం కెసిఆర్ అన్న మాటలివి.

 ‘మీకు చేతనైతే చేయండి.. లేకపోతే తప్పుకోండి. పనులు ఎలా పూర్తి చేయించాలో నాకు బాగా తెలుసు. పనులు ఇలానే చేస్తే ఇంకా 20 ఏళ్లయినా ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు పూర్తికావు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 తెలంగాణ ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారు?

‘యాదాద్రి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులు సాగుతున్న తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు... దాదాపు ఏడాదిన్నర కాలంగా సాగుతున్న పనుల్లో అంతకంతకూ నెలకొంటున్న జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందంటూ వైటీడీఏ, అర్‌అండ్‌బీ, ఆలయ పర్యవేక్షణ అధికారులు, స్థపతులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించారు. ఆలయ గోపుర నిర్మాణాన్ని పరిశీలిస్తూ.. ఈ గోపురం మార్చి వరకు ఏ విధంగా పూర్తవుతుంది,’ అని  స్థపతిని, ఆర్కిటెక్ట్‌ ఆనందసాయిని నిలదీశారు.

ఇది కూడా చంద్రబాబు నాయుడి శిరోవేదనే. భాష అదే.

 ‘‘గతంలో నేను ఇక్కడికి వచ్చి చూసినప్పుడు పనులు ఎలా ఉన్నాయో ఇప్పుడూ అదే స్థితిలో ఉన్నాయి’’ అని కెసిఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

చంద్రబాబు పోలవరం రివ్యూ సమాచారం ఇదిగో...

ఇప్పటికి ఎన్ని సోమవారాలలో ఆయన పోలవరాన్ని రివ్యూచేశారో అన్ని సార్లు  ప్రాజక్టు పనుల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పోలవరం  పనులు మందకొడిగా జరుగుతున్నాయని, దీనిని సహించనని  చెబుతుంటారు. పని సరిగ్గాచేయని కాంట్రాక్టర్ బ్లాక్ లిస్టు లోపెట్టండని హూంకరిస్తూ ఉంటారు. ఇంతవరకు ఎవరినీ బ్లాక్ పెట్టింది లేదు. 

2017 మే ఒకటో తేదీన,సోమవారం కాబట్టి, ఒక రివ్యూ జరిగింది.ఆ రివ్యూ లో కూడా ఎప్పటిలాగే ఆయన తీవ్ర అసంతృప్తి ఆగ్రహ జ్వాలలు వెల్ల గక్కారు. ఎప్పటిలాగే, దీని మీద ముఖ్యమంత్రి సమాచార విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదిగో సమీక్ష వివరాలు :

 

“ఎర్త్ వర్క్ విషయంలో ఎన్నిసార్లు చెప్పినా లక్ష్యాన్ని చేరుకోలేక అంతులేని కాలయాపన చేస్తున్నారని, దీనికి నిర్మాణ సంస్థలు చెప్పే సమాధానాలు కూడా అర్థవంతంగా లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.పనుల ఆలస్యానికి సంబంధించి ప్రతి సమీక్షలోనూ చెప్పిన కారణాలనే చెబుతున్నారే తప్ప పురోగతి మాత్రం చూపించడం లేదని అన్నారు.పోలవరం మట్టి తవ్వకం సహా మిగిలిన అన్ని పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.” అని ప్రెస్ నోట్ విడుదల చేశారు.

"సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో పోలవరం సహా రాష్ట్రంలోని ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల పురోగతిని జలవనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు.పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయాఫ్రం వాల్, గేట్ల ఫాబ్రికేషన్ పనులు కొంతవరకు ఆశాజనకంగానే వున్నా ఎర్త్ వర్క్, కాఫర్ డ్యాం పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయంటూ ముఖ్యమంత్రి నిర్మాణ సంస్థల ప్రతినిధులపై మండిపడ్డారు.

పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి 2018 డిసెంబరు నాటికల్లా గ్రావిటీ ద్వారా నీరు అందించాలన్న సదుద్దేశంతో సహకరిస్తున్నామని, అయినా నిర్మాణ సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, ఈ తీరు సరికాదని ముఖ్యమంత్రి హితవు చెప్పారు.  ఇపుడేమో పోలవరం కాంట్రాక్టర్ ని మార్చాల్సిందే అంటున్నారు. ఇందులో ఉన్నమతలబు ఏంటి?

అదీ సంగతి. 

ఇద్దరికి  రెండు ప్రతిష్టాత్మకమయిన ప్రాజక్టులే. కడుతున్నకాంట్రాక్టర్లు మనోళ్లే, ఇంజనీర్లు మనోళ్లే, అధికారులు మనోళ్లే, మంత్రి మనోడే... మరెందుకు ఈ జాప్యం, ఈ కోపం, ఈ రుసరుసలు.

 

 

click me!