కర్ణాటక కథకు సోనియా ట్విస్ట్: గోవా అనుభవమే, ఏం జరిగింది?

First Published May 15, 2018, 3:22 PM IST
Highlights

 గోవా అనుభవం నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం కర్ణాటకలో చురుగ్గా కదిలినట్లు కనిపిస్తోంది.

బెంగళూరు: గోవా అనుభవం నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం కర్ణాటకలో చురుగ్గా కదిలినట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో జెడిఎస్ కు మద్దతు ఇచ్చి, బిజెపిని అడ్డుకోవడానికి కాంగ్రెసు వేగంగా కదిలింది. స్వయంగా సోనియా గాంధీ రంగంలోకి దిగారు. దీంతో గోవాలో చూపిన అలసత్వం కర్ణాటకలో చూపకూడదనే ఉద్దేశంతో సోనియా రంగంలోకి దిగినట్లు కనిపిస్తున్నారు.

గోవా గవర్నర్ వ్యవహరించిన విధానాన్నే కర్ణాటక గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలికే విషయంలో అనుసరించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

గోవాలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాని స్థితిలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెసు అతి పెద్ద పార్టీగా అవతరించినా కూడా బిజెపి వేగంగా పావులు కదపడంతో అధికారానికి దూరంగా కావాల్సి వచ్చింది. 

రెండో స్థానంలో ఉన్న బిజెపి అధికారం చేపట్టడానికి అవసరమైన 21 మంది సభ్యుల మద్దతును కూడగట్టుకుంది. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెసు 17 స్థానిాలు, బిజెపి 13 స్థానాలు గెలుచుకున్నాయి. ఎంజీపి, జిఎఫ్ పిల సభ్యులతో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో గోవాలో 2017లో బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. 

గోవాలో అతి పెద్ద గ్రూపును ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. ఆ కారణంగా బిజెపి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం కాంగ్రెసు, జెడిఎస్ లు ఒక్కటి కావడంతో అధికారం చేపట్టడానికి అవసరమైన మెజారిటీ ఉంటుంది. దీంతో గవర్నర్ తప్పకుండా జెడిఎస్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించక తప్పదని అంటున్నారు. 

దీంతో దాదాపుగా కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం అదిష్టించే అవకాశం ఉంది. అయితే, జెడిఎస్ తో బిజెపి నాయకులు కూడా సంప్రదింపులు ప్రారంభించారు. జెడిఎస్ తో చర్చలకు అమిత్ షా నడ్డాను, జవదేకర్ ను నియోగించారు. కాంగ్రెసు, బిజెపిల మధ్య తగాదాతో కుమారస్వామి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోబుతున్నారని చెప్పవచ్చు.

click me!