యడ్యూరప్ప ఇంటి వద్ద మారిన సీన్: గవర్నర్ నిర్ణయమే కీలకం

First Published May 15, 2018, 2:41 PM IST
Highlights

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ట్రెండ్స్ అకస్మాత్తుగా మారడంతో బిజెపిలో టెన్షన్ ప్రారంభమైంది.

బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ట్రెండ్స్ అకస్మాత్తుగా మారడంతో బిజెపిలో టెన్షన్ ప్రారంభమైంది. బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి బిఎస్ యడ్యూరప్ప ఇంటి వద్ద సీన్ మారిపోియంది. కర్ణాటక కథకు కాంగ్రెసు అధినేత్రి సోనియా గాంధీ ట్విస్ట్ ఇవ్వడంతో బిజెపిలో గుబులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

బేషరతుగా బయటి నుంచి కాంగ్రెసు పార్టీ కుమారస్వామికి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడింది. స్వయంగా సోనియా గాంధీ రంగంలోకి దిగే సరికి పరిస్థితి తారుమారయ్యేట్లు కనిపిస్తోంది. ఈ స్థితిలో యడ్యూరప్ప మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు.

అయితే, ఈ స్థితిలో గవర్నర్ నిర్ణయం కీలకం కానుంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడే పరిస్థితి వచ్చింది. తొలి ట్రెండ్స్ బిజెపికి అనుకూలంగా ఉన్నప్పటికీ సమయం గడిచినకొద్దీ మారిపోతూ వచ్చాయి. బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరిస్తోంది. కానీ అధికారాన్ని చేపట్టగలదా, లేదా అనేది సందేహంగానే ఉంది.

ఈ స్థితిలో గవర్నర్ ఎవరిని పిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. గవర్నర్ తో భేటీ కాంగ్రెసు పార్టీ నాయకులు సాయంత్రానికి అపాయింట్ మెంట్ తీసుకున్నారు. జెడిఎస్ కు మద్దతు ఇస్తామని చెప్పి, గవర్నర్ కు ఓ లేఖను అందించే అవకాశం కూడా ఉంది.

అప్పుడు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అతి పెద్ద పార్టీని పిలుస్తారా, అతి పెద్ద గ్రూపును పిలుస్తారా అనేది ఉత్కంఠను రేపే విషయం. ఈ స్థితిలో ఏం జరుగుతుందనే విషయంపై బిజెపి క్యాడర్ ను టెన్షన్ పట్టుకుంది.

click me!