
తమిళ నాడు.. మళ్లీ సినీ స్టార్ల చేతుల్లోకి వెళ్లిపోతుందా.. అలాంటి సూచనలే కనిపిస్తున్నాయి. ప్రజల్లో ఈ ఆలోచనకు విలక్షణ నాయకుడు కమల్ హాసన్ అంకురం వేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎప్పుడైతే స్వర్గస్థులయ్యారో.. ఆ నాటి నుంచే తమిళ రాజకీయాలు కుక్కలు చింపిన విస్తరిలా తయారయ్యాయి. ఆమె తర్వాత అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు చాలా మంది చాలా కుతంత్రాలే చేశారు. అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలి పీఠం కోసం కొట్టుకుంటుంటే.. మూడో వర్గమైన ప్రతిపక్ష డీఎంకే పార్టీ అధికారం కోసం కాచుక్కూర్చుంది.
ఇలా వాడీ వేడిగా సాగుతున్న తమిళ రాజకీయాల్లో నటుడు కమలహాసన్ ఆజ్యం పోసారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానంటూ సంచలనం సృష్టించాడు. తమిళ రాజకీయాల గురించి, అధికారుల పనితీరు గురించి ఎప్పుడూ విమర్శించే కమల్.. ఏకంగా తాను కొత్త పార్టీ పెడతానంటూ అందరికీ షాక్ ఇచ్చాడు.
ఆ షాక్ నుంచి పూర్తిగా అందరూ కోలుకోక ముందే.. తాను సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి పనిచేస్తానంటూ మరో షాక్ ఇచ్చాడు. సూపర్ స్టార్ రజినీ కాంత్.. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు గత కొంతకాలంగా అందరికీ చెబుతూనే ఉన్నాడు. అత్యధికంగా అభిమానులు ఉన్న నటుడు రజినీకాంత్.. ఆయన కనుక రాజకీయాల్లోకి వస్తే.. ప్రస్తుతం ఉన్న వారంతా మూటా ముల్లె సర్దుకోవాల్సిందేనంటూ పలువురు భావించారు కూడా. అయితే.. ఈ సూపర్ స్టార్ ముందడగు వేయడానికి కాస్త జంకుతున్నారు. తన అభిమాన సంఘాలతో చాలా సార్లు సమావేశాలు నిర్వహించినప్పటికీ.. రాజకీయ అరంగేట్రంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో.. ఇక ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టేది లేదు అని అంతా లైట్ తీసుకున్నారు.
కానీ అకస్మాత్తుగా కమల్ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ రాజకీయ తెరపైకి రజినీ ప్రత్యక్షమయ్యాడు. విలక్షణ నటుడు కమల్, సూపర్ స్టార్ రజినీ కాంత్.. ఇద్దరు ఆప్తమిత్రులన్న విషయం అందరికీ తెలిసిందే. వారి స్నేహం 40ఏళ్ల నాటిది. రజినీకాంత్ కొత్త పార్టీ పెట్టే ధైర్యం చేయలేకపోయారు.. అందుకే కమల్ పెట్టే పార్టీలో చేరతారేమో అనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. ‘తాము ఇద్దరికీ సినిమాల్లో పోటీ గానీ.. రాజకీయాల్లో కాదు. తాము ప్రజల కోసం కలిసి పని చేస్తామని’ కమల్ చెప్పిన దగ్గర నుంచి ఈ విషయమే తమిళ నాట హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు.. వీరిద్దరికీ ప్రజాకర్షణ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో వీరు పెట్టబోయే పార్టీపై ఇప్పటికే ప్రజల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి.
సినిమా నటులు తమిళ రాజకీయాలనే ఏలడం కొత్త విషయమేమి కాదు, ఎంజీఆర్, జయలలిత, కరుణా నిధి, విజయ్ కాంత్.. సినీ రంగం నుంచి వచ్చి.. రాజకీయాల్లో తమదైన ముద్ర వేసినవారే. వీరి అడుగు జాడల్లోనే కమల్, రజినీ నడిచి.. ప్రస్తుత సంక్షోభంలో ఉన్న తమిళ రాజకీయాలను గాడిలో పెడతారేమో వేచి చూడాలి.