
పెద్ద నోట్ల రద్దు గడువు తర్వాత బ్యాంకు ఖాతాల్లో లక్షల కోట్లు ఉన్నట్లు ఐటి శాఖ గుర్తించిందని ప్రచారం మొదలైంది. పెద్ద నోట్ల రద్దు గడువైన డిసెంబర్ 31 తర్వాత వివిధ ఖాతాల్లో జమైన డబ్బుపై ఐటి శాఖ దృష్టి పెట్టంది. గడువు తర్వాత దేశం మొత్తం మీద నల్లధనం విషయంలో ప్రభుత్వం చెప్పిందంతా కథలేనంటూ విపక్షాలు, మీడియా ప్రధానమంత్రి నరేంద్రమోడిపై విరుచుకుపడుతున్న సంగతి అందరూ చూస్తున్నదే.
ఇటువంటి సమయంలో వివిధ బ్యాంకుల్లో సంవత్సరాల తరబడి నిరుపయోగంగా ఉన్న ఖాతాల్లో సుమారు 25 వేల కోట్లు జమైనట్లు ఐటి శాఖ గుర్తించిందట. అంతేకాకుండా దేశంలోని కోట్లాది ఖాతాల్లో లెక్కల్లో చూపని సుమారు రూ. 4 లక్షల కోట్లు వుండవచ్చని ప్రచారం మొదలైంది.
అదే విధంగా సహకార బ్యాంకుల ఖాతాల్లో ఐటి శాఖ సుమారు రూ. 16 వేల కోట్లు గుర్తించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో ఇప్పటి వరకూ సుమారు రూ. 6 వేల కోట్లు లెక్కలు చూపని నల్లధనం బయటపడినట్లు ఐటి శాఖ అధికారికంగా వెల్లడించట గమనార్హం.
ఎప్పుడో తీసుకుని తిరిగి చెల్లించని రుణాలు కూడా సుమారు రూ. 80 వేల కోట్ల మేరకు బ్యాంకులకు వచ్చేసినట్లు ప్రచారం అవుతోంది. ఇదంతా నిజమేనా కాదా అన్న విషయాన్ని ఎవరూ నిర్ధారించటం లేదు. ఎందుకంటే, ఆర్బిఐ, బ్యాంకుల కన్షార్షియం, కేంద్ర ఆర్ధికశాఖ, ఐటి శాఖ ఇలా..ఎవ్వరు కూడా నిర్ధారించటం లేదు.
పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై కేంద్రప్రభుత్వంపై వివిధ వర్గాలు విరుచుకుపడుతున్న నేపధ్యంలో పై లెక్కలు ప్రచారంలోకి రావటంలో ఏమన్నా మతలబు వున్నదా అని పలువురు అనుమానిస్తున్నారు. కొద్ది రోజులు ఆగితే విషయాలు బయటకు వచ్చేస్తాయి కదా ? చూద్దాం..ఏమవుతుందో.