
మన మాజీ నౌకాదళ అధికారి కుల్ భూషణ్ యాదవ్ గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో పాక్ సైనిక్ కోర్టు నిన్న ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.
దేశ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయంగా మారింది. భారత్ ప్రభుత్వం కూడా దీనిపై తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతోంది. అయితే పాక్ ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించకుండా తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తన్న వేళ భారత్ మాత్రం ప్రతీకారేచ్ఛతో కాకుండా మానవత్వంతో పాక్ కు ధీటైన జవాబు ఇచ్చింది.
ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’ కథనం ప్రకారం సోమవారం తెల్లవారుఝామున అరేబియా సముద్రంలోని గుజరాత్ తీరంలో భారత సైన్యం గస్తీ కాస్తున్న వేళ అనుకోని సంఘటన ఎదురైంది.
భారత్ తీరంలోకి అక్రమంగా చొరబడిన పాక్ మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీ (పీఎంఎస్ఏ) కి చెందిన ఓ బోటు ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న ముగ్గురు కమెండోలు సముద్రంలో కొట్టుకు పోయారు.
అయితే అదే సమయంలో తీరంలో గస్తీ కాస్తున్న భారత్ కు చెందిన అరింజయ్ కోస్ట్ గార్డ్ షిప్ కు ఈ సందేశం వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన మన కోస్ట్ గార్డ్ సిబ్బంది క్షణం ఆలస్యం చేయకుండా ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లారు. సముద్రంలో కొట్టుకపోతున్న ముగ్గురిని రక్షించారు.
అయితే అందులో అప్పటికే ఒకరు మృతిచెందారు. మిగిలిన ఇద్దరు పాక్ మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన కమాండోలుగా గుర్తించారు. వారిని పాక్ మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీకి అప్పగించారు.