
మీ మెదడుకి పదునుపెట్టి.. ఒక చిన్న ఐడియా ఇచ్చారంటే చాలు.. ఏకంగా రూ.10లక్షలు గెలుచుకోవచ్చు. ఇంతకీ ఎవరికి ఇవ్వాలి..? ఎలాంటి ఐడియా ఇవ్వాలో తెలుసుకోవాలని ఉందా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.. భారతీయ రైల్వే తన సేవలను మెరుగుపరుచుకునేందుకు ప్రజల నుంచి సలహాలను సేకరించేపనిలో పడింది. ఆదాయాన్ని మెరుగుపరచడానికి ఒక ఐడియా చెప్పండంటూ ప్రజలను కోరుతోంది. అధికారులను మెచ్చేలా..ది బెస్ట్ ఐడియా ఇస్తే రూ.10లక్షలు ఇస్తారు. ఫస్ట్ ప్రైజ్ మనీ రూ.10లక్షలు కాగా.. రెండో ఐడియాకు రూ.5లక్షలు, మూడో ఐడియాకు రూ.3లక్షలు, నాలుగో దానికి రూ.లక్ష వరకూ ఇస్తామని భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది.
మెరుగైన సేవలు అందించి మరింత ఆదాయం పొందటం ఎలా అనే ఆలోచనతో భారతీయ రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనికోసం ప్రజల్లోనే పోటీ పెట్టి వారి ద్వారా మెరుగైన సలహాలు పొందే ప్రయత్నంలో ఉంది. మీ దగ్గర అద్భుతమైన ఐడియా ఉంటే వెంటనే ఇచ్చేయచ్చు. ఇక పూర్తి వివరాల కోసం https://innovate.mygov.in/jan-bhagidari. అనే వెబ్‌సైట్ ని సంప్రదించాల్సి ఉంటుంది. దీనికి చివరి తేదీగా 2018, మే 19 నిర్ణయించారు.
‘మెరుగైన సేవలు ద్వారా ఎక్కువ ఆదాయం గడించేందుకు భారతీయ రైల్వేలు ప్రజల నుంచి సలహాలు సేకరిస్తోంది. ఇదో మంచి అవకాశం. దీని ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం ఉంటుందని’ జెన్ భగీదరీ వెబ్‌సైట్ అధికారి తెలిపారు. ‘సలహా పూర్తి బిజినెస్ ప్లాన్‌గా ఉండాలి. రైల్వే ఆదాయాన్ని పెంచేందుకు అది తోడ్పాటునందించాలని’ ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.అయితే ఈ పోటీ మొత్తం మూడు దశల్లో ఉంటుంది. మొత్తం 1000పదాలలో మీ సలహా ఇస్తే చాలు. మరి ఇంకేందుకు ఆలస్యం మీ మెదడుకు కాస్త పని పెట్టండి. రూ.10లక్షలు మీ సొంతం చేసుకోండి.