
దేశంలోని ప్రజలందరూ నగదు రహిత లావాదేవీలకు మళ్ళాలంటే కనీసం 20 ఏళ్ళు పడతుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ లావదేవీలనీ, క్యాష్ లెస్, లెస్ క్యాష్ అని మొత్తుకుంటున్న సంగతి అందరూ చూస్తున్నదే. అయితే, ప్రభుత్వం ముందు చూపు లేకుండా చేసిన పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సమస్యలు మొదలయ్యాయి.
పెద్ద నోట్లను రద్దు చేయటమైతే ప్రధానమంత్రి నరేంద్రమోడి చేతిలో ఉంది కాబట్టి రద్దు చేసేసారు. మరి నగదుకు ప్రత్యామ్నాయం చూపటం మోడి చేతిలో లేదుకాబట్టే దేశవ్యాప్తంగా గగ్గోలు మొదలైంది. దశాబ్దాల తరబడి నగదు చెలామణికి అలవాటు పడిన యావత్ దేశాన్ని ఒక్కసారిగా డిజిటల్ లావాదేవీలవైపు మళ్లించాలన్న మోడి చర్య తుగ్లక్ చర్యే.
ప్రజలను డిజిటల్ లావాదేవీలైపు మళ్ళించాలంటే అందుకు ముందస్తు కసరత్తు చాలా జరగాల్సి ఉండగా అదేమీ చేయలేదు. పిచ్చోడి చేతిలో రాయి లాగ ఒక్కసారిగా పెద్ద నోట్లను మోడి రద్దు చేయటంతో దేశ ఆర్ధిక పరిస్ధితి కుదేలైంది.
పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ లావాదేవీల ప్రక్రియపై ‘అసాచోం’ అనే సంస్ధ దేశవ్యాప్తంగా సర్వే జరిపింది. ఆ సర్వేలో కొన్ని నిజాలు బయటపడ్డాయి. అవేంటంటే, గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా నగదు రహిత లావాదేవీల వైపు మళ్ళాలంటే కనీసం 20 ఏళ్ళు పడుతుందన్నది కీలకం.
మెట్రో నగరాలకు కూడా కనీసం నాలుగు ఏళ్ళు పడుతుందట. అదికూడా మోట్రో నగరాల్లో అత్యధికంగా 70 శాతం మాత్రమే ఆశించవచ్చట. మెట్రో నగరాల పరిస్ధితే ఈ విధంగా ఉంటే చిన్న నగరాలు, పట్టణాల గురించి చెప్పేదేముంటుంది.
దేశజనాభాలో 70 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, ఏటిఎంల సదుపాయాలు పెద్దగా లేవు. దేశవ్యాప్తంగా ఉన్న ఏటిఎంల్లో కేవలం 20 వేలు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికీ విద్యుత్ లేని గ్రామాలు వేలల్లో ఉన్నాయి. విద్యుత్తే లేకపోతే ఇక ఇంటర్నెట్ పరిస్ధితి గురించి చెప్పనే అక్కర్లేదు.
ఇదిలావుండగా, మన దేశంలో సైబర్ నేరాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. బాగా చదువుకున్న వాళ్లే సైబర్ నేరాల బారినుండి తప్పించుకోలేకున్నారు. ఇక, నిరక్షరాస్యుల సంగతి చెప్పేదేముంది? పైగా మనకు అక్షరాస్యత కూడా తక్కువ.
కాబట్టి ఈ పరిస్ధితుల్లో ప్రభుత్వం తుగ్లక్ చర్యలు మానేసి ముందు అందరికీ నగదు లభ్యత గురించి యోచించటం మంచిది. అందరినీ డిజిటల్ లావాదేవీలవైపు నడిపించాలంటే అందుకు చేయాల్సింది దీర్ఘకాలిక ప్రణాళికలు చిత్తశుద్దితో అమలు చేయటం. అంతేకానీ అర్ధాంతరంగా నగదు రద్దు చేయటం మాత్రం కాదు.