‘మీ దేశంలో బీఫ్ తిని.. తర్వాత భారత్ కి రండి..’

First Published Sep 8, 2017, 1:32 PM IST
Highlights
  • మీ దేశంలో భీఫ్ తిని భారత్ కి రావలన్న కేంద్ర మంత్రి
  • భారత్ కి  వచ్చే పర్యాటకులకు మంత్రి సూచన

భారత్ కి వచ్చే పర్యాటకులు.. తమ దేశాల్లో భీఫ్ తిని.. తర్వాత భారత్ కి రావాలని నూతనంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేజే ఆల్ఫోన్స్ అన్నారు.  మన దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఫుడ్ కోడ్ అంటూ ఏదీ లేదని ఇటీవల  ఆయన చెప్పారు. అంతేకాదు.. గోవా, కేరళ లోని ప్రజలు భీఫ్ తినవచ్చని కూడా ఆయన చెప్పారు. కాగా.. ఈఱోజు మాత్రం పర్యాటకులు భారత్ కి వచ్చే ముందే వారి దేశాల్లోనే బీఫ్ తిని రావాలని సూచించారు.

ఇటీవల గో సంరక్షణ పేరుతో దేశంలో దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పర్యాటకంపై ఈ ఘటనలు ప్రభావాన్ని చూపించాయా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు.

‘పర్యాటకులు తమ దేశంలో బీఫ్‌ తిని ఆ తర్వాత భారత్‌కు రావాలి’ అని ఆల్ఫోన్స్‌ అన్నారు. అయితే ఇటీవల బీఫ్‌పై చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా.. ‘నేను ఆహార మంత్రిని కాను. పర్యాటక మంత్రిని మాత్రమే’ అని చెప్పారు. ‘మన దేశానిది అతి పురాతనమైన నాగరికత. ప్రపంచం మొత్తం మన దేశానికి వచ్చి ఇక్కడి అందాలను చూడాలి. అందుకు తగ్గట్లుగా టూరిజంను అభివృద్ధి చేస్తాం’ అని చెప్పుకొచ్చారు.

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేజే ఆల్ఫోన్స్‌ పర్యాటకశాఖ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజు ఆల్ఫోన్స్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆహార విషయంలో రాష్ట్రాలకు భాజపా నిబంధనలు పెట్టిందని నేను అనుకోను. గోవాలాగే కేరళలోని ప్రజలు కూడా బీఫ్‌ తినొచ్చు. దాంతో భాజపాకు ఎలాంటి సమస్యా లేదు’ అని ఆల్ఫోన్స్‌ చెప్పారు.

click me!