నదుల్లో పడవ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయో తెలుసా?

First Published Nov 13, 2017, 5:49 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కెనాల్స్ అండ్ పబ్లిక్ ఫెరీస్ యాక్ట్ అనే చట్టం ఉన్నదని తెలుసా?

నదులలో బోటు ప్రయాణాలను నియంత్రించడం జిల్లా కలెక్టర్ గారి బాధ్యతలలో ఒకటి

కృష్ణా నదిలో నిన్న అయిన ప్రమాదం మీద ఒక సిట్టింగ్ హై కోర్టు జడ్జి గారిచేత నిష్పాక్షికమైన  దర్యాప్తు చేయించాల

 

నిన్న విజయవాడ సమీపంలో కృష్ణానదిలో జరిగిన ఘోర ఫెరీ ప్రమాదం  ఎందుకు జరిగిందో అందరికి అర్థమయ్యే విధంగా మాజీ కేంద్ర కార్యదర్శి డాక్టర్ ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాశారు.  ఆ లేఖ చదివితే పొరపాట్లెక్కడ జరిగాయో, ఎందుకు జరిగాయో, ప్రభుత్వాలు ఏ విషయాల మీద శ్రద్ధ చూపి, ఏ విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నాయో అర్థమవుతుంది.  ఈ లేఖని యధాతథంగా అందిస్తున్నాం.

 

ఈ అ స శర్మ 

14-40-4/1 గోఖలే రోడ్ 

మహారాణిపేట 

విశాఖపట్నం 530002

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి 

అయ్యా,


గోదావరి పుష్కరాలలో అయిన అతి ఘోరమైన ప్రమాదం తరువాత, నిన్న కృష్ణా నదిలో అయిన బోటు దుర్ఘటన బాధాకరంగా ఉంది. ఇంతవరకు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. వారి కుటుంబాలకు ప్రభుత్వంలో ఎవరు జవాబు చెప్పవలసి ఉంది? 

మీ ప్రభుత్వం పర్యాటక కార్యక్రమాలమీద చూపిస్తున్న ఆసక్తి, పర్యాటకుల భద్రత మీద చూపించడం లేదు అనే విషయం స్పష్ఠమవుతున్నది. 

వార్తా పత్రికలలో వస్తున్న వార్తల ప్రకారం, ప్రయాణీకులు ఎక్కిన బోటు ఒక ప్రయివేటు సంస్థ వారి బోటు అని, అసలు ఆ సంస్థకు ఆ ప్రదేశంలో బోటు నడపడానికి అనుమతే లేదని, బోటులో లైఫ్ జాకెట్లుకూడా లేవని, బోటును ఓవర్లోడ్ చేశారని తెలుస్తున్నది. ఎప్పుడూ చెప్పినట్లే కృష్ణా జిల్లా కలక్టరు గారు, పోలీస్ కమీషనర్ గారు, ప్రమాదం ఎప్పుడు అయినది, ఎలా అయినది అనే విషయాలమీదనే ప్రస్తావించారు కాని, అధికారుల త్రప్పిదాలగురించి మాత్రం ప్రస్తావించ లేదు. వారిద్దరికీ ఈ విషయంలో బాధ్యత లేదా ?


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర Canals and Public Ferries Act అనే చట్టం ఉన్నదని, ఆ చట్టం ప్రకారం నదులలో కెనాలులలో తిరిగే బోటులను నియంత్రించాలని, ముఖ్యంగా ప్రయాణీకుల భద్రత గురించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాధికారులకు అవగాహన లేదని స్పష్ఠమవుతున్నది. మీ ప్రభుత్వం (CCLA) వెబ్సైట్ లో, జిల్లా కలెక్టర్ గారి బాధ్యతలలో, ఒక బాధ్యత నదులలో బోటు ప్రయాణాలను నియంత్రించడం. ఈ రోజులలో VIP ల చుట్టూ తిరిగే కలెక్టరేట్ అధికారులు దీనిని గుర్తించి ఉండరు. కాని వారు ఇటువంటి బాధ్యతను నిర్వర్తించకపోవడం వలన, ఇరవై మంది ప్రాణాలు బలి అవ్వడం చాలా బాధాకరమైన విషయం. 

జాతీయ డిసాస్టర్ మానేజ్మెంట్ అథారిటీ వారు ప్రత్యేకంగా నదులలో అయ్యే బోటు ప్రమాదాలను ఎలాగ అరికట్టాలి అనే విషయం మీద విపులంగా ఇచ్చిన సూచనలను జత పరుస్తున్నాను. మీ ప్రభుత్వ రెవిన్యూ కార్యదర్శి ఈ సూచనలను చదివి జీర్ణించుకొని, జిల్లా కలెక్టర్లకు పంపించే ఉంటారు. అదే నిజమైతే, మరి ఆ సూచనలను జిల్లా కలక్టరు గారు, పోలీస్ కమీషనర్ గారు ఎందుకు అమలు చేయలేదు? అమలు చేసి ఉంటే, నిన్న ప్రమాదానికి దారి తీసిన బోటు లైఫ్ జాకెట్లను ప్రయాణీకులకు అందుపాటులో ఉంచి ఉండేది, ఓవర్లోడ్ చేయకుండా ఉండేది. లైసెన్స్ ఉన్న బోటు డ్రైవరు ప్రమాదాన్ని రాకుండా చూసి ఉండే వాడు. అటువంటి డిసాస్టర్ మానేజ్మెంట్ అథారిటీ వారి సూచనలను అమలు చేయని అధికారులు, ముఖ్యంగా సీనియర్ అధికారుల మీద గట్టి చర్యలు తీసుకోకపోతే, ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం ఉంది. 

అసలు ఇటువంటి ఘోరమైన ప్రమాదానికి కారకులైన ప్రైవేట్ సంస్థ ఎవరు? ఆ సంస్థ ప్రమోటర్లు ఎవరు? అనుమతులు లేకుండా లాభాలకోసం ఆ బోటును నడపడం, నడిపేటప్పుడు కావలసినన్ని లైఫ్ జాకెట్లు పెట్టుకోకపోవడం, భద్రతను ఖాతరు చేయకుండా ఓవర్లోడ్ చేయడం చూస్తే, ఇందులో ఒక్క అధికారుల ప్రమేయమే కాకుండా, ప్రభుత్వంలో పెద్దలతో సంబంధం ఉన్న ప్రముఖుల ప్రమేయంకూడా ఉంది అనే విషయం స్పష్ఠం గా కనిపిస్తున్నది. అటువంటి వారిమీద దర్యాప్తు చేసి వారిమీద కూడా కఠినమైన చర్యలు తీసుకోకపోతే, నిన్న సంభవించినట్లు , భవిష్యత్తులో ఇంకా ఎన్నో ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంది. ఆ విషయంలో ప్రభుత్వాన్ని నడిపే మీకు, మీ మంత్రులకు బాధ్యత ఉంటుంది అని గుర్తించాలి. 


ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి. 

రాష్ట్రంలో రాజ్యాంగం మీద, చట్టాల మీద, రూల్స్ మీద గౌరవం త్రగ్గుతున్నట్లు అనిపిస్తున్నది. ప్రభుత్వంలో పెద్దలే చట్టాలను ఉల్లంఘిస్తే, ప్రజలలో క్రింది వరకు చట్టాలమీద ఉండవలసిన గౌరవం త్రగ్గుతుంది. ప్రజా స్వామ్య వ్యవస్థలో అటువంటి పరిణామం ఎవ్వరికీ మంచిది కాదు. "Ease of Doing Business" అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చేయడం కాదు. చట్టపరంగా ఎటువంటి ఉల్లంఘనలు చేయకుండా బిజినెస్ చేయడం. చట్టాలను ఉల్లంఘించి పరిశ్రమలు పెట్టేవారు, వ్యాపారం చేసే వారు, ప్రజలకు అపారమైన హాని చేస్తారు. ప్రభుత్వంలో లంచగొండి తనం పెరుగుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. ప్రజల వనరులు దోచుకోబడతాయి. అటువంటి బిజినెస్ మోడల్ మన రాష్ట్రంలో త్వరిత గతిలో వస్తున్నదా అనే సందేహం నాకు కలుగుతున్నది. ప్రభుత్వం అన్ని విషయాలలో చట్టాలను గౌరవించి, ఆ చట్టాలను ప్రజలకు అనుకూలంగా అమలు చేస్తారని నేను ఆశిస్తున్నాను. 

కృష్ణా నదిలో నిన్న అయిన ప్రమాదం మీద ఒక సిట్టింగ్ హై కోర్టు జడ్జి గారిచేత నిష్పాక్షికమైన  దర్యాప్తు చేయించాలని నా విజ్ఞప్తి. అధికారులమీద, ప్రైవేటు వ్యవస్థమీద, ప్రైవేటు వ్యక్తులమీద, పెద్దలమీద చర్యలు త్రీసుకోకపోతే, మీరు ఇటువంటి ప్రమాదాలను అరికట్టలేరు.  


ఇట్లు 

ఈ అ స శర్మ 

విశాఖపట్నం 

13-11-2017 

click me!