
పెద్ద నోట్ల రద్దుతో ప్రధానమంత్రి చివరకు ఎలుకను కూడా పట్టలేకపోయరు. గడచిన 45 రోజుల్లో దేశం మొత్తం మీద ఇప్పటి వరకూ బయటపడిన నల్లధనం సుమారు రూ. 4 వేల కోట్లు మాత్రమే. దేశంలో పెరిగిపోయిన నల్లధనాన్ని అరికట్టటానికి, తీవ్రవాదులకు అందుతున్న డబ్బును నియంత్రించేందుకే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8వ తేదీన మోడి ప్రకటించారు.
అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు యావత్ దేశ ప్రజలను నానా యాతనలకు గురిచేస్తోంది. ఎందుకంటే, మోడి అనుకున్నది ఒకటైతే, దేశవ్యాప్తంగా జరుగుతోందొకటి. దేశవ్యాప్తంగా సుమారు రూ. 4 లక్షల కోట్ల నల్లధనం ఉంటుందని కేంద్రం అంచనా.
తీరా చూస్తే బయటపడిన నల్లధనం కేవలం రూ. 4 వేల కోట్లు కూడా లేదని అధికారిక లెక్కలు వెల్లడిచేస్తోంది. రద్దైన పెద్ద నోట్లలో దాదాపు రూ. 15 లక్షల కోట్లు ఇప్పటికే బ్యాంకులకు తిరిగి వచ్చేసింది.
నోట్లు రద్దైన నవంబర్ 8వ తేదీ నుండి డిసెంబర్ 24వ తేదీ మధ్య దేశవ్యాప్తంగా 734 దాడులు జరిగాయి. పై దాడుల్లో బయటపడింది రూ. 3700 కోట్లు మాత్రమే. ఐటి, సిబిఐ, ఇడి అధికారులు జరిపిన దాడుల్లో 3200 మందికి నోటీసులను ఇచ్చారు. వీరంతా పన్ను ఎగవేత, హవాలా, వెల్లడించలేని సంపద కలిగి ఉండటమనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు.
పై సంస్ధలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో రూ. 500 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు, నగదు, బంగారు కడ్డీలు కలిగి ఉన్నారు. ప్రభుత్వం రద్దు చేసిన మొత్తం రూ. 15.50 లక్షల కోట్ల నగదులో ఇప్పటికి బయటపడిన నల్లధనం కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే. అంటే ఎంత శాతమో అర్ధం చేసుకోవచ్చు.
ప్రధాని చెప్పినట్లుగా 50 రోజుల గడువుకు ఇక మిగిలింది ఆరు రోజులు మాత్రమే. ఈ ఆరు రోజుల్లో ఏ మేరకు నల్లధనం వెల్లడవుతుందో మోడినే చెప్పాలి.