
మన నేతలు గోరీలు తప్ప తమ పేరు మీద అన్నింటికి కట్టించకుంటారు.
వాళ్ల పేర్లతో ఎవరో గుళ్లు కడుతూ ఉంటే నివారించరు. ఇన్ని అవలక్షణాలున్న తమని దేవుడిగా ప్రతిష్టిస్తుంటే సిగ్గపడురు. ప్రజల డబ్బును సొంత లాభానికి పంచి పెడుతూ అదేదో తమ పెద్దల అస్థి దాన ధర్మం చేస్తున్నట్లు బ్రహ్మాండమయిన కార్యక్రమాలు ఏర్పాటుచేసుకుంటారు. రోడ్లు వేయడం దగ్గిర నుంచి ఆరోగ్య బీమా దాకా అన్నింటికి తమ పేర్లు పెట్టించకుంటారు.తైనాతీలు తమ పేర్లను దేశం మీద రుద్ది అది స్వామిభక్తిలాగా ప్రదర్శిస్తూంటే, ఏ మాత్రం సిగ్గ పడకుండా ఇంటిల్లీ పాదీ అనందిస్తారు.
ఇలాంటపుడు మొన్న చనిపోయిన క్యూబా మాజీ అద్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో తన పేరును ఎక్కడా వాడవద్దని వేడుకుని చనిపోయాడు.
శవం కాలక ముందే విగ్రహాలు లేచే దేశం లో బతికేవాళ్లకి ఇది వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే, అధికారంలో ఉన్న ఆయన తమ్ముడు రవుల్ క్యాస్ట్రో సోదరుడికి ప్రపంచ వ్యాపితంగా వున్న గుడ్ విల్ అడ్డంపెట్టుకుని పదవిలో కొనసాగాలనుకోలేదు. వ్యక్తి పూజ రోగం ప్రబలేందుకు తన పేరు ఉపయోగ పడరాదన్న సోదరుడి కోరిక ప్రకారం, రవుల్ శనివారం నాడు ఒక ప్రకటన చేశారు.
శాంటియాగోలో ఫిడెల్ అంతిమ యాత్ర సందర్భంగా లక్షలాది ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తొందర్లో పార్లమెంటు సమావేశమయి ఫిడెల్ కోరికను చట్టబద్ధం చేసేందుకు ఒక చట్టం తీసుకువస్తుందని ప్రకటించారు. ‘ ఒకసారి చనిపోయాక, ఆయన పేరును గాని, ఆయన ఇష్టాయిష్టాలను గాని దేశంలోని సంస్థలకు, పార్క్ లకు, వీధులకు, మరేఇతర పబ్లిక్ ప్రదేశాలకు రుద్దకుండా నిషేధిస్తాం. నివాళులర్పించే పేరుతో విగ్రహాలరూపంలో లేదా మరే ఇతర జ్ఞాపకాల రూపంలో కూడా ఫిడేల్ ని నిలబెట్ట రాదు,’ అని రవుల్ అన్నారు.
ఫిడెల్ క్యాస్ట్రో బతికున్నపుడు కూడా వ్యక్తి ఆరాధనకు దారి తీసే మారే పరిస్థితిని ఎపుడు తీసుకురాలేదు. దీనికి భిన్నంగా ఆయన కాలంలో షె గువేరా విగ్రహాలు దేశమంతా వచ్చాయి.
ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాలలోనే కాదు, భారత దేశంలో వూహించగలమా. తండ్రుల, తాతల,మామల, ఇతర త్యాగ మూర్తుల, బలిపశువుల పేర్లు ఉపయోగించుకోకుండా రాజకీయ మార్కెట్లో చెల్లే రూకలు ఈ దేశంలో లేవేమో...