
ఉత్తరాఖండ్ లో జరిగిన భాజపా పరివర్తన్ ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్రమోడి చేసిన ప్రకటనలపై దేశం మొత్తం ఆశ్చర్యపోతోంది. ‘గురిచూసి కొట్టా..తగలాల్సిన వారికే దెబ్బ తగిలింది’ అంటూ మోడి ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. మోడి కొట్టిన దెబ్బ ఎవరికి తగిలిందా అని అందరూ ఆరా తీసారు.
చూస్తే పెద్ద నోట్ల రద్దు వల్ల కుబేరులకు ఎవరికీ దెబ్బ తగిలినట్లు కనబడలేదు. ఎందుకంటే, నల్లధనం ఉంది అన్న కారణంతో ఎవరినీ అరెస్టు చేయలేదు.
‘ఒకే దెబ్బకు పలు పిట్టలు నేల రాలినట్లు’ మోడి చెప్పుకున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నేలరాలిన పిట్టలు ఎవరబ్బా అని అందరూ తెగ వెతికారు. చూస్తే డబ్బుల కోసం క్యూలైన్లలో నిలబడి నేలరాలిపోయిన 200 మంది కనిపించారు. పెద్ద నోట్ల రద్దైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఇప్పటికి సుమారు 200 మంది చనిపోయారు.
‘నల్లధన కుబేరుల్ని తరిమేసే కాపలాదారుడి పని చేస్తున్నా’ అన్నారు. ఇదేంటబ్బా అని చూసారు. కుబేరుల జోలికి ఎవరూ వెళ్లకుండా కాపాలాకాస్తున్నట్లు తెలిసింది. రూ. 2 వేల కోసం సామాన్య జనాలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడి ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు ఓ పక్క. ఇంకో వైపేమో కోట్లాది రూపాయల కొత్త 2 వేల నోట్లు కుబేరుల ఇళ్ళలోకి నడిచి వెళ్లిపోతోంది.
చెన్నైలోని వ్యాపార వేత్త శేఖర్రెడ్డి మొదలుకుని దేశవ్యాప్తంగా డబ్బున్న వాళ్లెవరూ 2 వేల నోటు కోసం క్యూలైన్లో నిలబడలేదెందుకు? సెలబ్రిటీలెవరూ క్యూలైన్లలో కనబడలేదే? వారికెవరికీ డబ్బులతో పనిలేదా? గడచిన నెలన్నర రోజులుగా వారందరూ డబ్బులకు ఏం చేస్తున్నట్లు? వీటన్నింటికీ మోడి మహాశయుడు సమాధానాలు చెబితే బాగుంటుంది.
‘తగలాల్సిన వారికే దెబ్బ తగిలింద’ టూ చాలా గొప్పగా చెప్పుకున్నారు. నల్లధన కుబేరులందరూ ఇళ్ళలో కూర్చునే తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇక తగిలిన దెబ్బ ఎవరికి? మామూలు జనాలకేగా. అవసరాలకు సరిపడా డబ్బు లేకుండా వివాహాలను వాయిదా వేసుకున్నవారు, ఆపరేషన్లు వాయిదా పడినవన్నీ మామూలు జనాలకేగా. ఎవరికైనా డౌటా?