
పురట్చితలైవిగా ప్రజల నీరాజనాలందుకున్న జయలలిత మృతితో తమిళనాడు రాజకీయాల్లో సమీకరణలు మారిపోనున్నాయి. తమిళ రాజకీయాలు ఒక విధంగా మొదటి నుండి వ్యక్తుల చుట్టూనే సాగుతున్నాయి. దానికి తోడు పలు సందర్భాల్లో సినీ గ్లామర్ కూడా తోడవుతుండటంతో ప్రజారాధనకు అవధులే లేకపోయాయి.
జయ సిఎంగా ఉన్నంత కాలం పార్టీలో రెండో స్ధానం ఎవరిది అన్న చర్చ అవసరం రాలేదు. అయితే, జయలలిత హటాత్తుగా కన్నుమూయటంతో ఆపద్ధర్మ సిఎంగా పనిచేస్తున్న పన్నీర్ సెల్వమే పూర్తిస్ధాయి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, జయ లాగ పన్నీర్ ప్రజాకర్షక నేత కాకపోవటమే అసలు సమస్య. ‘అమ్మ’ స్ధానాన్ని భర్తీ చేయాలంటే ప్రజలు ప్రతీ చిన్న విషయాన్ని జయతోనే పోల్చి చూస్తారనటంలో సందేహం అక్కర్లేదు.
ఇక, డిఎంకె పరిస్ధితి చూస్తే అక్కడా అంతంత మాత్రమే. 94 ఏళ్ళ కురువృద్ధుడు ఎంకె కరుణానిధి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్ధితి కూడా ఈరోజే రేపో అన్నట్లుగా ఉంది. దాంతో తమిళనాడు ప్రజలు త్వరలో మరో పిడుగుపాటు లాంటి వార్త వినకతప్పదు. అయితే, తన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేది కుమారుడు స్టాలినే అని కరుణ ప్రకటించటంతో ఆ పార్టీలో నాయకత్వ సమస్య లేదు.
అదేవిధంగా, డిఎండికె పార్టీకి మరో సినీనటుడు, కెప్టెన్ గా పరిచితుడైన విజయకాంత్ నేతృత్వం వహిస్తున్నప్పటికీ మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. పైగా విజయకాంత్ ను కూడా ప్రజలు తిరస్కరించారు. ఇక, ఎండిఎంకె, పిఎంకె, ఎంకె తదితర చిల్లర పార్టీలు చాలానే ఉన్నప్పటికీ అవన్నీ ఏదో ఒకటి రెండు జిల్లాలకు మాత్రమే పరిమితమైనవి కావటం గమనార్హం.
ఈ నేపధ్యంలో తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పగల నేత, రాష్ట్రమంతటా అనుచరులు, పార్టీ క్యాడర్ ను కలిగిన ప్రజాధరణ ఉన్న ఏకైక బలమైన నేత ఒక్క స్టాలిన్ మాత్రమే కనబడుతున్నారు. ఎందుకంటే, 93 సీట్లతో డిఎంకె బలమైన ప్రతిపక్షంగా పనిచేస్తోంది.
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఏదో ఉనికి కోసమే ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం పన్నీర్ సెల్వను పట్టుకుని భాజపా ఎదగాలని చూస్తున్నట్లు కనబడుతోంది. ఏదేమైనా జయ అస్తమయంతో తమిళనాడు రాజకీయాల్లో సమీకరణల్లో మారిపోవటం మాత్రం ఖాయం.