
కాంగ్రెస్ పార్టీని 2012లో అహంభావం ముంచేసింది ... అప్పటి నుంచి పార్టీ.. ప్రజల నుంచి దూరమైందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఆయన ప్రస్తుతం యూఎస్ పర్యటనలో ఉన్నారు. రెండు వారాల పాటు యూఎస్ లో పర్యటనలో భాగంగా రాహుల్ బర్ల్కీ చేరుకున్నారు. ఈ సందర్భంగా కాలిఫోర్నియా యూనివర్శిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘ఇండియా ఎట్ 70: రిఫ్లెక్షన్స్ ఆన్ ది పాత్ ఫార్వర్డ్’ అనే అంశంపై మాట్లాడిన రాహుల్.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను రాహుల్ తప్పుపట్టారు. చీఫ్ ఎకనమిక్ ఎడ్వైసర్ , పార్లమెంట్ నిర్ణయం తీసుకోకుండా పెద్ద నోట్లు రద్దు చేశారన్నారు. డీమానిటైజేషన్ వల్ల దేశానికి చాలా నష్టం వాటిల్లిందని రాహుల్ అన్నారు. 1984లో జరిగిన అల్లర్ల గురించి మాట్లాడుతూ.. ఆ అల్లర్ల బాధితుల్లో తాను కూడా ఉన్నానన్నారు. ఆ బాధితులకు న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆ అల్లర్ల కారణంగానే తన తండ్రిని, నాయనమ్మని కోల్పాయానని..తాను కాకుండా ఇంకెవరైనా వాటి గురించి అర్థం చేసుకోగలరా అంటూ ప్రశ్నించారు.
వారసత్వ రాజకీయాల గురించి ఒకరు ప్రశ్నించగా.. అఖిలేష్ యాదవ్, స్టాలిన్, అనురాగ్ థాకూర్ లాంటి వారందరూ వారసత్వ రాజకీయాలకు ఉదాహరణే అని, తాను ఒక్కడే అలా వచ్చిన వాడిని కాదని అ రాహుల్ చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లో అంత యాక్టివ్ గా ఎందుకు ఉండరూ అంటూ.. ఒకరు రాహుల్ ని ప్రశ్నించగా.. బీజేపీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందని.. కేవలం తన గురించి అసత్య ప్రచారం చేసేందుకే పలువురిని నియమించారని.. దానికి ప్రత్యేకంగా ఓ మిషన్ ని ఏర్పాటు చేసిందని.. అందుకే తాను ఏమీ మాట్లాడటం లేదని రాహుల్ తెలిపారు.
మన్మోహన్ సింగ్, చిదంబరం, జైరాం రమేష్ లాంటి నేతలతో కలిసి 9సంవత్సరాల పాటు దేశం కోసం పనిచేశానని రాహుల్ తెలిపారు. జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదాన్ని తాము అనచివేశామన్నారు. జమ్మూకశ్మీర్ లోని పీడీపీ పార్టీ యువకులు రాజకీయాల్లోకి రావడానికి ప్రోత్సాహం అందించేందని.. అలాంటి పార్టీతో మోదీ పొత్తు పెట్టుకొని ఆ పార్టీని నాశనం చేసేశాడని రాహుల్ ఆరోపించారు.