మేకప్ రూంనుంచి జెఎన్ యు లీడర్ గా ఎదిగిన తెలుగువాడు

First Published Sep 12, 2017, 11:13 AM IST
Highlights
  • సానియా మీర్జా ఎంగేజ్ మెంట్ లో వెయిటర్ గా చేసిన శ్రీకృష్ణ
  • నాలుగు సంవత్సరాల పాటు టాలీవుడ్ లో మేకప్ మేన్ గా చేసిన శ్రీకృష్ణ
  • ఇప్పుడు జేఎన్ యూ లీడర్ గా ఎంపికైన శ్రీకృష్ణ

‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహాపురుషులౌతారు’ అన్నాడు ఓ మహానుభావుడు. ఈ వ్యక్తి గురించి వింటే.. అది అక్షరాల నిజమని మీరంతా అభిప్రాయపడతారు. రోజువారీ కూలి కొడుకు.. ఈ పూట కడుపు ఎలా నిండుతుంది రా భగవంతుడా.. అని ఆలోచించే కుటుంబంలో పుట్టిన ఓ యువకుడు.. ఇప్పుడు.. వందల మంది విద్యార్థులకు యూనియన్ లీడర్ అయ్యాడు. అంత సులభంగా తాను ఆ స్థానాన్ని చేరుకోలేదు. ఎంతో కష్టపడ్డాడు.. రాత్రి, పగలు తేడా లేకుండా దొరికిన ఉద్యోగమల్లా చేస్తూ.. విద్యనభ్యసించాడు.  ఇప్పుడు యూనియన్ లీడర్ అయ్యాడు.. అతనే దుగ్గిరాల శ్రీకృష్ణ.. ప్రస్తుత జేఎన్ యూ స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ.

 

వివరాల్లోకి వెళితే.. దుగ్గిరాల శ్రీకృష్ణ(27)  ప్రకాశం జిల్లాకు చెందిన వాడు. చిన్నతనంలో  హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. అతని తండ్రి లింగపల్లి ప్రాంతంలో రోజు కూలీగా పనిచేస్తున్నాడు. ఓ దళిత కుటుంబానికి చెందిన శ్రకృష్ణ.. తన చదువు కొనసాగించడం కోసం చేయని పనంటూ లేదు. టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ లో వెయిటర్ గా పనిచేశాడు. తాను జేఎన్ యూలో చేరే వరకు మొత్తం 17 ఉద్యోగాలు చేశాడు. ఓ వైపు విద్యనభ్యసిస్తూనే.. మరో వైపు తన చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించి పార్ట్ టైమ్ జాబ్ చేసేవాడు. ఒకనొక సమయంలో ఒక ఉద్యోగం పగలంతా చేసి.. మరో ఉద్యోగం రాత్రి సమయంలో కూడా చేసేవాడు.

ఈ ఎస్ఎఫ్ఐ లీడర్.. కి సినిమాలంటే చాలా ఆసక్తి.. జేఎన్ యూ లో ఆయన ఉండే హాస్టల్ గదిలో చూస్తే..  టాలీవుడ్, బాలీవుడ్ హీరోల ఫోటోలు అంటించి ఉంటాయి. అంతేకాదు.. కొంతకాలం హైదరాబాద్ లో హీరోయిన్లకు మేకప్ మేన్ గా పనిచేశాడు.  కాజల్ అగర్వాల్, అనుష్క, ప్రియా ఆనంద్, హరిప్రియ లాంటి నటులకు మేకప్ చేశాడట. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి అంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు. రాజమౌళి పని రాక్షసుడని ఆయనే తనకు ఆదర్శమని శ్రీకృష్ణ చెప్పాడు.

 

 ఎప్పటికైనా ‘లీడర్’ లాంటి సినిమా తీయాలనేది తన కోరిక అని ఆయన చెప్పాడు. తన కమ్యూనిష్టు మానిఫెస్ట్ లో ఉన్న వ్యాఖ్యాలకంటే ఎక్కువగా ఆయనకు శ్రీశ్రీ చెప్పిన మాటలు కంఠస్తమని గర్వంగా చెప్పుకుంటాడు. తనకు ఈ రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదని.. తనకు తెలుగు లిటరేచర్ అంటే చాలా ఇష్టమని శ్రీ కృష్ణ చెప్పారు.

 

హైదరాబాద్ ఉద్యోగం చేసుకుంటూ డిగ్రీ పూర్తి చేసిన శ్రీకృష్ణ.. తర్వాత 2013లో జేఎన్ యూలో సీటు సంపాదించాడు. అక్కడ నిర్వహించిన స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో శ్రీకృష్ణ సహా నలుగురు పోటీ చేయగా... మొత్తం 4,620 ఓట్లలో అత్యధికంగా శ్రీకృష్ణ 2,042 ఓట్లు సొంతం చేసుకున్నారు.  ఈ ఎన్నికల్లో గెలిచిన రోజు రాత్రి విద్యార్థులంతా సెలబ్రేట్ చేసుకున్నాడు. అప్పుడు సమయం దాదాపు ఉదయం 4గంటలు కావస్తోందనగా.. తాను పడుకోవడానికి తన గదికి వెళ్తున్నానని.. ఉదయం 8గంటలకు తన గదికి వస్తే.. యూనియన్ కోసం చేయాల్సిన పనుల గురించి  చర్చిద్దామని శ్రీకృష్ణ తన తోటి ఎస్ ఎఫ్ఐ లీడర్స్ కి చెప్పాడట. అది విని తోటి విద్యార్థులు షాక్ అయ్యారట. పని పట్ల తనకు నిబద్ధత ఎక్కువని తోటి విద్యార్థులు చెబుతున్నారు.

 

తాను ప్రస్తుతం యూనియన్ లీడర్ అయినప్పటికీ.. తన తల్లిదండ్రులకు యూనివర్శిటీ, జనరల్ సెక్రటరీ లాంటివి ఏమీ తెలివని చెబుతున్నాడు. తాను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు పాఠశాలలో నెలకు అయ్యే ఖర్చుల కోసం రూ.20 ఇచ్చేవారు.. ఇప్పుడు జేఎన్ యూలో స్కాలర్ షిప్ కింద రూ.5వేలు ఇస్తున్నారు. ఇది తనకు లక్సరీ ఎమౌంట్ అని ఆయన అన్నారు. ఎస్ఎఫ్ఐ తనను ఎంతగానో ప్రోత్సహించిందని.. అందుకు తాను రుణపడి ఉంటానని.. యూనియన్ లీడర్ గా విద్యార్థుల సమస్యల పై పోరాడతానని మాట ఇస్తున్నాడు.

 

click me!