
ఇకమీదట ఉద్యోగ, ఉపాధి కల్పన గ్యారంటీ ఆధారంగా పరిశ్రమలకు యితీలిచ్చే విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. మంగళవారం సచివాలయంలో స్టేట్ ఇన్వెస్టుమెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు అధికారులకు సూచనలిచ్పచారు. ఈ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
ప్రధానంగా 6 మెగా ప్రాజెక్టులకు సంబంధించిన రూ.3,808 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను ఎస్ఐపీబీ ఆమోదించింది. ఈ ఆరు మెగా ప్రాజెక్టులతో రాష్ట్రానికి మరో 5,325 ఉద్యోగాలు దక్కనున్నాయి. కేసీపీ లిమిటెడ్, చెట్టినాడ్ సిమెంట్, రెయిన్ గ్రూపు, మోహన్ స్పిన్‌టెక్స్ ఇండియా, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, విశ్వా అపెరల్స్ తదితర సంస్థలు ఈ మెగా ప్రాజెక్టులను నెలకొల్పుతున్నాయి.
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో వంద ఎకరాల విస్తీర్ణంలో కేసీపీ లిమిటెడ్ సంస్థ సిమెంట్ తయారీ పరిశ్రమను నెలకొల్పనున్నది. దీనికోసం రూ.531.61 కోట్ల పెట్టుబడి పెడుతోంది. వందమందికి ప్రత్యక్షంగా, 1900 మందికి పరోక్షంగా ఈ పరిశ్రమ వల్ల ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. ప్రాజెక్టు తొలి దశ పూర్తిచేసుకున్న మొదటి ఏడాదిలోనే రూ.174.14 కోట్లు, 5 వ ఏడాది నాటికి రూ.403.01 కోట్ల టర్నోవర్ సాధించవచ్చని అంచనా.
చెట్టినాడు సిమెంట్ కార్పొరేషన్ మరో మెగా ప్రాజెక్టుతో ముందుకొచ్చింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెడగర్లపాడులో 1000 ఎకరాల విస్తీర్ణంలో సిమెంట్ తయారీ పరిశ్రమను, విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం, గైతులపాలెం, నరసాపురం గ్రామాలలోని 75 ఎకరాలలో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను నెలకొల్పుతోంది. ఈ రెండు పరిశ్రమలపై మొత్తం రూ.1350 కోట్లు పెట్టుబడి పెడుతోంది. 2019 నాటికి ఈ మెగా ప్రాజెక్టు ఉత్పత్తి ప్రారంభిస్తుంది. మొత్తం 1250 మందికి ఈ రెండు యూనిట్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. కాల్సిన్డ్ పెట్రోలియం కోక్ ప్లాంట్, సిమెంట్ గ్రైండింగ్ యూనిట్, ఆర్ అండ్ డీ సెంటర్, వేస్ట్ హీట్ రికవరీ పవర్ ప్లాంట్ నెలకొల్పడానికి రెయిన్ గ్రూపు ఏర్పాట్లు చేసుకుంటోంది. విశాఖ జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లోని 80.33 ఎకరాల స్థలంలో వీటిని ఏర్పాటు చేస్తారు. వీటి మొత్తం పెట్టుబడి రూ.1046 కోట్లు. మొత్తం వెయ్యి మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. మూడు దశలలో ఈ మెగాప్రాజెక్టు పూర్తవుతుంది. రూ.1168.94 కోట్ల టర్నోవర్ వుంటుందని అంచనా.