
రాష్ట్రం రెండుగా విడిపోయి మూడేళ్లు దాటినా విభజన సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు.అటెండర్ల నుంచి అధికారుల వరకు ఇప్పుడు విభజన యుద్ధంలో స్థాయి బేధం లేకుండా పాల్గొంటున్నారు.
ఉమ్మడిగా కేటాయించిన భవనాల్లో అయితే ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ లో అయితే మూడేళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. తాజాగా రెండు రాష్ట్రాల అధికారుల మధ్య విభజన యుద్ధం తారాస్థాయికి చేరింది.
ఏపీ భవన్ లోని రెసిడెంట్ కమిషనర్ బంగ్లా కేంద్రంగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య దూషణల పర్వం మొదలైంది.రెసిడెంట్ కమిషనర్ బంగ్లాను డార్మెటరీగా మార్చడం వల్ల భద్రతకు ముప్పు అని పేర్కొంటూ తెలంగాణా అధికారుల నోటీసులు, తాళాలు వేయడంతో ఏపీ అధికారులు ఫైర్ అయ్యారు.
బంగ్లాకు వేసిన తాళాలను పగులగొట్టిన ఏపీ అధికారులు... తెలంగాణా అధికారులతో వాగ్వాదానికి దిగారు.సమస్యలేవైనా ఉంటే తమను సంప్రదించాలి తప్ప తాళాలు వేయడం భావ్యం కాదని తెలంగాణ అధికారులకు సూచించారు.
తెలంగాణాకు కేటాయించిన 42 శాతం కంటే ఎక్కువగానే వారు గదులు, భవనాలు వినియోగిస్తున్నారని ఆరోపించారు.
గవర్నర్, జడ్జిలకు బస బాధ్యత తెలంగాణాదే అయినా తాము కూడా గదులు, భవనాలు కేటాయిస్తున్నామని వివరణ ఇచ్చారు. ఐఏఎస్ ఇంటర్వూలకు వచ్చే విద్యార్థులకు బస కల్పించేందుకు తాము ప్రయత్నిస్తుంటే తెలంగాణ అధికారులు దౌర్జనంగా తాళాలు వేశారని ఏపీ భవన్ అసిస్టెంట్ కమిషనర్ సూర్యనారాయణ తెలిపారు.
అయితే తెలంగాణ అధికారుల వాదన మాత్రం మరో విధంగా ఉంది. గవర్నర్, జడ్జిల బసకు సమీపంలో బంగ్లాను నిబంధనలకు విరుద్ధంగా డార్మెటరీగా మార్చారని అందుకే భద్రతా నేపథ్యంలోనే దానికి తాళాలు వేసినట్లు వివరణ ఇచ్చారు.
తమతో మాట్లాడకుండానే ఏపీ అధికారులు బంగ్లా తాళాలు పగులకొట్టారని విమర్శించారు. తెలంగాణాకు కేటాయించిన వాటా కంటే తక్కువ గదులు, భవనాలే తమకు కేటాయించారని, 36 శాతానికి మించి తాము భవనాలను వాడుకోవడం లేదని తెలంగాణ భవన్ అస్టిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్ వివరణ ఇచ్చారు.