చంద్రబాబు నిర్ణయంపై అచ్చెన్న అనుమానం

First Published Nov 14, 2017, 1:17 PM IST
Highlights
  • మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
  • మంత్రి అచ్చెన్నను ప్రశ్నించిన శాసనసభ్యులు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఓ నిర్ణయం మంత్రి అచ్చెన్నాయుడులో అనుమానం రేకెత్తించిందట. అసలు ఇది జరిగే పనేనా..? ముఖ్య మంత్రి అలా ఎలా హామీ ఇచ్చారనే సందేహం కలిగిందని స్వయంగా మంత్రే చెప్పారు.

ఇక అసలు సంగతేంటంటే.. మంగళవారం ఏపీ శాసనసభ సమావేశాలు మూడో రోజు మొదలైన సంగతి తెలిసిందే. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి అచ్చెన్నపై పలువురు శాసనసభ్యులు ప్రశ్నలు సంధించారు. వాటికి ఆయన సవివరంగా సమాధానాలు చెప్పారు. ప్రస్తుత రోజుల్లో భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కట్టెల పొయ్యి కనిపించడం లేదని, అందరి ఇళ్లల్లో గ్యాస్ మాత్రమే కనిపిస్తోందని అచ్చెన్న చెప్పారు. ఈ ఘనత టీడీపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ‘‘గ్యాస్ పొయ్యి, సిలిండర్లను రాష్ట్ర ప్రజలకు అందజేశాం.. భవిష్యత్తులో సిలిండర్లు లేకుండా పైపులైన్ ద్వారానే ప్రతి ఇంటికీ గ్యాస్ అమలు చేస్తాం’’ అని చంద్రబాబు చెప్పారని.. అదెలా సాధ్యమౌంతుందా అనే అనుమానం తనలో కలిగిందని సభాముఖంగా మంత్రి వివరించారు.  అయితే.. ఈ విషయంపై కాస్త నిదానంగా ఆలోచిస్తే.. సీఎం తీసుకున్న నిర్ణయం సరైనదేనని తనకు క్లారిటీ వచ్చిందని చెప్పారు. పైపులైన్ ద్వారా గ్యాస్ అందజేయడం అనేది ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి అర్థం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో కచ్చితంగా పైపు లైన్ల ద్వారా గ్యాస్ అందజేస్తామని.. ఈ విషయాన్ని శాసనసభ్యులు తమ నియోజకవర్గ ప్రజలకు వివరించాలని అచ్చన్న  విజ్ఞప్తి చేశారు.

click me!