ఉద్యోగులపై ప్రభుత్వానికే నమ్మకం లేదా?

First Published Oct 30, 2017, 4:33 PM IST
Highlights
  • టాయ్ లెట్ మినహా.. సచివాలయ కారిడార్లు, ఉన్నతాధికారుల క్యాబిన్లు.. చివరికి ఉద్యోగులు ఉపయోగించే కంప్యూటర్లలో సైతం కెమేరాలు అమర్చారు.
  • కంప్యూటర్లలో కూడా కెమెరాలు ఏర్పాటు చేస్తే.. ప్రశాంతంగా ఎలా పనిచేయగలమని ప్రశ్నించారు

సచివాలయంలో పనిచేసే ఉద్యోగులపై ప్రభుత్వానికే నమ్మకం  లేనట్టు కనిపిస్తోంది. అందుకే కార్యాలయం మొత్తం సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. టాయ్ లెట్ మినహా.. సచివాలయ కారిడార్లు, ఉన్నతాధికారుల క్యాబిన్లు.. చివరికి ఉద్యోగులు ఉపయోగించే కంప్యూటర్లలో సైతం కెమేరాలు అమర్చారు.

కారిడార్లలో మాత్రమే కాకుండా.. కంప్యూటర్లలో సైతం కెమేరాలు ఏర్పాటు చేశారన్న విషయం తెలిసిన నాటి నుంచి ఉద్యోగులంతా ఆందోళన పడుతున్నారు. కెమేరా కన్ను తమను చూస్తుందనే భావన వారిలో ఒత్తిడి పెంచుతోంది. దీంతో పనిపై పూర్తి స్థాయిలో దృష్టి కేటాయించలేకపోతున్నారు. ప్రశాంతంగా పని చేసుకోలేక పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహోద్యోగులతో మాట్లాడాలన్నా కూడా తమకు భయం వేస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు.

ఇది సచివాలయమా ‘బిగ్‌బాస్‌’షోనా అని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ షోలో 60 కెమెరాలైతే ఇక్కడ ఏకంగా 240 కెమెరాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కంప్యూటర్లలో కూడా కెమెరాలు ఏర్పాటు చేస్తే.. ప్రశాంతంగా ఎలా పనిచేయగలమని ప్రశ్నించారు. ఏ అధికారి వద్దకు.. ఎవరు వచ్చి వెళ్తున్నారనే వివరాలను తెలుసుకునే రీతిలో కెమెరాల ఏర్పాటు చేశారని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికలకు ముందు మారిన మనిషినని చంద్రబాబు పదేపదే చెప్తే సంతోషించామని, కానీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదనే విషయం మరోసారి స్పష్టమైందన్నారు.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రగా ఉన్నప్పుడు ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించడం వల్ల తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారని చంద్రబాబే చాలా సార్లు చెప్పారు. ఈ సారి ఉద్యోగులను అలా ఇబ్బంది పెట్టనని... తాను మారిన మనిషినని కూడా చెప్పుకొచ్చారు. కానీ మళ్లీ అదే పనిచేశారు. గతంలో ఉద్యోగుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరించినా.. ఇలా కెమేరాలతో నిఘా మాత్రం పెట్టలేదు. ఈ సారి కెమేరాలు కూడా పెట్టేశారు. అయితే.. ఉద్యోగులు మాత్రం.. ఈ కెమేరాల విషయం ఏకంగా సీఎంతోనే తేల్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ఏలా స్పందిస్తారో వేచి చూడాలి.

click me!