
ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు ని మావోయిస్టులు టార్గెట్ చేశారా? అయ్యన్న దినచర్య, కదలికలు తెలుసుకునేందుకు మావోయిస్టు నేతలు ఏదైనా మాష్టర్ ప్లాన్ వేశారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. అయ్యన్నపాత్రుడు, ఆయన కుటుంబానికి మావోయిస్టు నేతల నుంచి ముప్పు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అయ్యన్న సోదరుడు మున్సిపల్ ఛైర్మన్ సన్యాసిని పాత్రుడు వాహనంలో దొరికిన ఓ పరికరం కలకలం రేపింది.
సన్యాసిని పాత్రుడు వాహనంలో గుర్తు తెలియని వ్యక్తులు వాయిస్ రికార్డర్ అమర్చారు. వాహనం శుభ్రం చేస్తుండగా ఈ పరికరం బయట పడింది. వాహనంలో మాట్లాడే మాటలే కాకుండా, ఇంట్లో మాట్లాడే మాటలు సైతం ఈ వాయిస్ రికార్డర్ లో నమోదు అయినట్లు గుర్తించారు. అయితే.. ఈ రికార్డర్ ని వాహనంలో ఎవరు అమర్చారు? ఎప్పుడు అమర్చారు అనే విషయంలో సర్వత్రా ఆందోళన మొదలైంది. ఈ విషయాలన్నింటినీ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో చాలా సార్లు అయ్యన్నకి, ఆయన కుటుంబ సభ్యులకు మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చాయి. దాంతో వారి కుటుంబ సభ్యలకు మొత్తానికి పోలుసులు బందోబస్తు పెంచారు. ఇప్పటికే జిల్లాలో పర్యటించడానికి కూడా అయ్యన్న భయపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రికార్డర్ బయటపడటంతో ఆయన కుటుంబ సభ్యులు మరింత భయాందోళనలకు గురౌతున్నారు. కాగా, పోలీసుల పటిష్ట భద్రత ఉన్నప్పటికీ కారులో రికార్డు ఎవరు పెట్టారనే విషయం చర్చనీయాంశం అయ్యింది.
ఇది కచ్చితంగా మావోయిస్టుల పనే అయ్యి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయన్నపాత్రుడుని టార్గెట్ చేసుకొని, ఆయన ఎక్కడున్నారు.. ఏమి చేస్తున్నారు..? లాంటి సమాచారాన్ని తెలుసుకునేందుకు మావోయిస్టులు ఈ రికార్డర్ ఏర్పాటు చేసి ఉంటారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ విషయాన్ని పోలీసులు చాలా సీరియస్ తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు.