
తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘అగ్రికల్చర్ లీడర్ షిప్’ అవార్డు వరించింది. దానిని సెప్టెంబర్ 5వ తేదీన ఆయనకు అందజేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. తమ ప్రియతమ నేతకు అంత గొప్ప అవార్డు వస్తోందని గులాబీ నేతలు, కేసీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. ఆ అవార్డు తీసుకోవడానికి ప్రస్తుతం కేసీఆర్ సంకోచిస్తున్నారట. అవార్డు వల్ల చెడ్డ పేరు వస్తుందేమోనని ఆయన భయపడుతున్నారట.
వివరాల్లోకి వెళితే... రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నందుకు గాను సీఎం కేసీఆర్‌కు ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్ -2017 అవార్డు అందజేస్తున్నట్లు ఆగస్టు నెలలో ప్రకటించారు. పాలసీ లీడర్‌షిప్ కేటగిరీ కింద కేసీఆర్‌కు ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు కోసం సీఎం కేసీఆర్ పేరును ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతిపాదించింది. కాగా సెప్టెంబర్ 5న రాత్రి 7.30 గంటలకు న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలస్‌లో ఈ అవార్డును సీఎం అందుకోవాల్సి ఉంది. భారత ఆహార వ్యవసాయ మండలి ఈ అవార్డును ఆయనకు అందజేయనుంది. లక్షలాది మంది వ్యవసాయదారుల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు ఈ అవార్డు లభించిందని కమిటీ స్పష్టం చేసింది. అంతేకాదు.. కేసీఆర్ కి ఈ అవార్డు ప్రకటించడం పట్ల గవర్నర్ నరసింహన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ప్రెస్ నోటు కూడా రిలీజ్ చేశారు. అవార్డు గురించి పబ్లిసిటీ కూడా ఇచ్చేశారు.
అయితే.. ప్రభుత్వం తరపున కాకుండా ప్రైవేటు సంస్థ ఏదైనా అవార్డు ఇస్తానంటే..ముందు దానిని సీఎంవో అధికారులు పరిశీలించి.. తర్వాత సీఎంకి తెలియజేయాలి. కానీ అలా చేయకుండా వెంటనే ఓకే చెప్పేశారట. అలా చెప్పిన తర్వాతా వారు దాని గురించి ఆరా తీసారట. వారు తెలుసుకున్న సమాచారం ప్రకారం 2015లో ఐసీఎఫ్ఏ స్థాపించారు. కానీ.. ఐసీఎఫ్ఏ మాత్రం 2008 నుంచి అవార్డులు అందజేస్తోందని చెప్పింది. 2015లో స్థాపిస్తే.. 2008 నుంచి అవార్డులు ఎలా ఇస్తారని వారిలో ఇప్పుడు అనుమానం కలిగింది. అయితే... అసలు విషయం ఏమిటంటే దానిని 2015లో స్థాపించినప్పటికీ.. అంతకముందు ‘ అగ్రికల్చర్ టుడే’ అనే మ్యాగ్జిన్ ఆధ్వర్యంలో అవార్డులు అందజేశారు. తరువాత దానిని ఐసీఎఫ్ ఏ పేరుతో ప్రారంభించారు. ముగ్గురు వ్యక్తులు బిజినెస్ పర్పస్ కింద దీనిని ప్రారంభించారు.
దీని గురించి సరైన సమాచారాన్ని అధికారులు సేకరించకపోవడంపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇలాంటి అవార్డు తీసుకుంటే తనకు ఏదైనా చెడ్డ పేరు వస్తుందేమో నని భయపడుతున్నారు.అందుకే అవార్డు కార్యక్రమానికి వెళ్లడానికి అనాసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.