‘బాహుబలి’పై ఆర్ నారాయణమూర్తి సంచలన కామెంట్స్

First Published Nov 16, 2017, 4:53 PM IST
Highlights
  • పెరుగుతున్న నందీ అవార్డుల వివాదం
  • బాహుబలిపై సంచలన కామెంట్స్ చేసిన ఆర్ నారాయణమూర్తి

‘‘ఉరుము ఉరిమి మంగళం మీద పడింది’’ అన్న సామేత వినే ఉంటారు. ఇప్పుడు బాహుబలి సినిమా పరిస్థితి కూడా అలానే ఉంది. లెజెండ్ సినిమాకి నందీ అవార్డులు వరస కట్టడంతో మొదలైన వివాదం.. రుద్రమదేవి నుంచి యూ టర్న్ తీసుకొని ఇప్పుడు బాహుబలి వద్దకు చేరుకుంది. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న బాహుబలి సినిమాకి అసలు అవార్డు అందుకునే స్థాయి కూడా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ చిత్రాలకు, నటీనటులకు నందీ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే పలువురు విమర్శలు గుప్పిస్తుండగా.. తాజాగా ఆర్ నారాయణమూర్తి కూడా ఆ జాబితాలో చేరిపోయారు. బాహుబలి సినిమాకి జాతీయ ఉత్తమ సినిమా అవార్డు వచ్చినప్పుడే అవార్డుల మీద ఉన్న నమ్మకం పోయిందని ఆయన అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ.. రుద్రమదేవి సినిమాకి నందీ అవార్డు రావాలన్నారు. దేశానికి ఝాన్సీలక్ష్మీబాయి ఎలాగో.. తెలుగు జాతికి రుద్రమదేవి అంతేనన్నారు. అంతటి మహనీయురాలైన రుద్రమదేవి జీవితాన్ని సినిమాగా తీస్తే దాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించే అవార్డులు సంస్కృతి, విలువలకు పట్టం కట్టేలా ఉండాలని సూచించారు.

ప్రస్తుతం అవార్డుల కేటాయింపు ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారాయన్నారు. సాంకేతికంగా, వినోదపరంగా తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన సినిమా బాహుబలి అని ఆయన చెప్పారు. అలాంటి సినిమాని అందించినందుకు రాజమౌళికి సెల్యూట్ చేయాల్సిందేనన్నారు. కానీ బాహుబలికి జాతీయ ఉత్తమ అవార్డు కేటాయించడం సరైన నిర్ణయం కాదని.. అప్పుడే అవార్డులపై నమ్మకంపోయిందన్నారు. అవార్డులన్నీ.. కమర్షియల్ చిత్రాలకు ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.

click me!