
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహింకు చెందిన రూ. 15 వేల కోట్ల ఆస్తులను యూఏఇ ప్రభుత్వం జప్తు చేసిందనే వార్త భోగస్సేనా? ఇపుడు దావూద్ ఆస్తుల జప్తు వంటి సంచలన వార్త ఎలా బయటకు వచ్చిందో కూడా దేశంలోని ఏ మీడియా కూడా చెప్పలేకపోతోంది.
ఎందుకంటే, జప్తు వివరాల గురించి అటు ఎమిరేట్స్ ప్రభుత్వానికి గానీ అక్కడి భారత రాయబార కార్యాలయానికి కూడా తెలీదట. అంతేకాదు..అక్కడి మీడియాకు కూడా ఏమాత్రం సమాచారం లేదు. నిజంగా దావూద్ ఆస్తులను ఎమిరేట్స్ లో జప్తు చేసివుంటే ఆదేశంలో మీడియాకు తెలీకుండా మన దేశం దాకా విషయం ఎలా వస్తుంది?
దావూద్ ఇబ్రహీం ఆస్తుల స్వాధీనం అంటే చిన్న విషయం కాదు. అంతర్జాతీయ స్ధాయిలో నేర సామ్రాజ్యం నెట్ వర్క్ ఉన్న దావూద్ ఆస్తుల స్వాధీనం వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తొలుత మన దేశంలో జీ న్యూస్ నెట్ వర్క్ ఈ వార్తను ప్రచురించింది. దాంతో గుడెద్దుల్లాగ మిగితా మీడియా సంస్ధలు ముందు వెనుక చూసుకోకుండా వెంటపడ్డాయి.
ఎప్పుడైతే జీన్యూస్ లో కథనం ప్రసారమైందో వెంటనే భారతీయ జనతా పార్టీ సమాచార, సాంకేతిక విభాగం కూడా మోడికి అబినందనలు తెలుపుతూ, మోడి విజయంగా చెబుతూ వరసుబెట్టి ట్వీట్లు చేయటం గమనార్హం.
ఎప్పుడైతే మొదట కథనం ప్రసారమైందో వెంటనే భాజపాలోని పలువురు నేతలు మోడిని ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్లు మొదలు పెట్టారు. మోడి దెబ్బకు దావూద్ ఆస్తుల స్వాధీనమంటూ ప్రసార సాధనాల్లో హడావుడి మొదలైంది.
తీరా చూస్తే దావూద్ ఆస్తుల స్వాధీనమూ లేదు..ఆయనపై కేసూ లేదు. ఇదంతా చూస్తుంటే ఎద్దు ఈనిందంటే..దూడను కట్టేయండి..అన్నట్లుంది వ్యవహరం. పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా అపఖ్యాతి తెచ్చుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడి వ్యవహారం నుండి మీడియా, జనాల దృష్టిని మళ్ళించేందుకే లేని వార్తను కావాలనే ఎవరో సృష్టించినట్లే కనబడుతోంది.