
ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ యాపిల్ భారత్ లో తయారు చేస్తున్న ఏకైక ఫోన్ ఐఫోన్ ఎస్ఈ. అందుకే.. అన్ని ఐఫోన్ వర్షన్ లలోనూ ఈ ఐఫోన్ ఎస్ఈ భారత్ లో తక్కువ ధరకి లభిస్తుంది. కాగా.. ఈ ఫోన్ ధర ఇప్పుడు మరింత తగ్గింది. రూ.26వేలుగా ఉన్న ఐఫోన్ ఎస్‌ఈ 32జీబీ వేరియంట్ అమెజాన్ ఇండియాలో రూ.17,999కే లభ్యమవుతుంది. అంటే రూ.8వేల మేర ధర తగ్గింది. కేవలం అమేజాన్ లో మాత్రమే ధర తగ్గించడం గమనార్హం. అధికారికంగా కంపెనీ అయితే ధర తగ్గించలేదు. ఆపిల్ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ధర రూ.26వేలుగానే ఉన్నట్టు తెలిసింది.
ఐఫోన్ ఎస్‌ఈపై ధర తగ్గడం ఇది రెండోసారి. కస్టమ్ డ్యూటీ పెరిగిన నేపథ్యంలో ఐఫోన్లపై రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే. కఆ సమయంలో ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గింది. ఇప్పుడు మరోసారి తగ్గింది. ఐఫోన్ ఎస్ఈ భారత్ లో తయారౌతుంది కాబట్టి దానికి కస్టమ్ డ్యూటీ వర్తించదు. ధర తగ్గడంతో ఐఫోన్ ఎస్‌ఈ ప్రస్తుతం మోటో జీ5ఎస్ ప్లస్, నోకియా 6, షియోమి ఎంఐ ఏ1 వంటి ఆండ్రాయిడ్ ఫోన్ల రేంజ్‌లో దొరుకుతోంది. అంతేకాక ఎక్స్చేంజ్‌లో ఈ ఐఫోన్ ఎస్‌ఈపై అమెజాన్ రూ.15వేల వరకు తగ్గింపును కూడా ఇస్తోంది.