గుజరాత్ అల్లర్లు.. మోడీకి క్లీన్ చిట్‌పై సవాలు.. సుప్రీంకోర్టులో విచారణ

By telugu teamFirst Published Nov 10, 2021, 6:29 PM IST
Highlights

గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్ర మోడీకి సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్లీన్ చిట్‌ను సవాల్ చేస్తూ అల్లర్లలో మరణించిన కాంగ్రెస్ ఎంపీ ఎహసాన్ జాఫ్రి భార్య జాకియా జాఫ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండానే సిట్ దశాబ్దకాలం తర్వాత కేసు మూసేసిందని ఆమె వాదించారు.
 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపిన 2002 గుజరాత్ అల్లర్ల(Gujarat Riots) గురించిన చర్చ మరోసారి Supreme Courtలో జరుగుతున్నది. ఈ అల్లర్లను దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఆధారాలను పట్టించుకోలేదని జాకియా జాఫ్రి సుప్రీంకోర్టులో వాదించారు. ఎలాంటి దర్యాప్తు లేకుండా కేసు మూసేశారని Zakia Jafri ఆరోపణలు చేశారు. ఆ ప్రత్యేక దర్యాప్తు బృందం వాంగ్మూలాలను రికార్డు చేయలేదని, ఫోన్లను సీజ్ చేయలేదని, బాంబులనూ ఎలా తయారు చేశారో పట్టించుకోలేదని వాదించారు. ఇలాంటివేవీ చేపట్టకుండానే నేరుగా కేసు మూసేసిందని అన్నారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి Narendra Modiకి క్లీన్ చిట్ ఇచ్చిందని తెలిపారు. ఈ క్లీన్ చిట్‌ను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

2002లో గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ ఎస్6 కోచ్‌లో మంటలతో కనీసం 59 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కదలించింది. ఈ ఘటన తర్వాతే రాష్ట్రంలో అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో కాంగ్రెస్ ఎంపీ ఎహసాన్ జాఫ్రిని హతమార్చారు. ఆమె సతీమణినే జాకియా జాఫ్రి. గత 20ఏళ్లుగతా ఆమె న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. 

అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీలో ఎహసాన్ జాఫ్రి సహా 68 మందిని చంపేశారు. 2002 ఫిబ్రవరి 28న ఈ ఘటన జరిగింది. గుజరాత్ అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇన్వెస్టిగేషన్ చేపట్టింది. దాదాపు దశాబ్దం తర్వాత 2012లో నరేంద్ర మోడీతోపాటు మరో 63 మందికి క్లీన్ చిట్ ఇస్తూ కేసు మూసేసింది. వారిని విచారించడానికి తగిన ఆధారాలు లేవని వివరించింది. సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ జాకియా జాఫ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనేక వాయిదాల తర్వాత నేడు ఆమె పిటిషన్‌ను జస్టిస్ ఏఎం ఖాన్విల్కార్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్‌ల ధర్మాసనం విచారించింది. జాకియా జాఫ్రి తరఫున కాంగ్రెస్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదిస్తున్నారు.

Also Read: గుజరాత్ అల్లర్ల కేసు: మోడీ పేరును తొలగించిన కోర్టు

తాను కూడా మతోన్మాద హింస బాధితుడినని జాకియా జాఫ్రి తరఫున వాదిస్తూ కపిల్ సిబల్ అన్నారు. 1947లో భారత దేశ విభజన తర్వాత జరిగిన మతోన్మాద హింసలో తన పూర్వీకులను కోల్పోయారని తెలిపారు. 

గత విచారణలో కపిల్ సిబల్ తమ పిటిషన్ కేవలం గుల్బర్గ్ సొసైటీకి సంబంధించినది కాదని అన్నారు. జాకియా జాఫ్రి పోరాటం లా అండ్ ఆర్డర్ కోసమని, పాలనాపరమైన వైఫల్యం గురించి అని వాదించారు. ఇందులో పెద్ద తలకాయలను దోషులుగా తేల్చాలని ఇప్పుడు తమ పిటిషనర్ భావించడం లేదని తెలిపారు.

Also Read: ఢిల్లీ అల్లర్ల కేసు.. ఆందోళన చేయడం ఉగ్రవాదం కాదు..!

పోలీసులు చర్యలు తీసుకోకుండా చూస్తూ కూర్చోవడం వల్లే చాలా మంది ఊచకోతకు గురయ్యారని కపిల్ సిబల్ అన్నారు. అందుకే తాను కేవలం ఆ కేసును విచారించాలని కోరుతున్నట్టు తెలిపారు. ఇదంతా కేవలం లా అండ్ ఆర్డర్, కేవలం పౌరుల హక్కుల గురించి మాత్రమే అని వాదించారు. గుజరాత్‌లో అప్పుడు పెద్ద కుట్ర జరిగిందని అన్నారు. అధికారుల ఉద్దేశపూర్వక మౌనం.. కొంతమంది విద్వేషపూరిత ప్రసంగాలు.. హింసకు ఊతమిచ్చాయని తెలిపారు. సుమారు 23వేల పేజీల ఆధారాలున్నాయని, కానీ, ఎవరూ వాటిని కన్నెత్తి చూడలేదని చెప్పారు.

పోలీసులే చేష్టలుడిగి చూసినందునే చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఇలాంటి విషయాల్లో కోర్టు కూడా కల్పించుకోకుంటే ప్రజలు ఇంకెవరి వద్దకు వెళ్తారని అడిగారు. కోర్టుల తీరుతోనే గణతంత్ర దేశాల మనుగడ ఆధారపడి ఉంటుందని వివరించారు.

click me!