
న్యూఢిల్లీ: బీజేపీ ఎల్లప్పుడూ అధికారంలో ఉంటుందని అది భావిస్తున్నదని రాహుల్ గాంధీ లండన్‌లో అన్నారు. ఏదో ఒక రోజు తప్పకుండా ప్రతిపక్షం అధికారంలోకి వస్తుందని, అప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి చేసిన నష్టాలను తప్పకుండా రిపేర్ చేస్తుందని వివరించారు. లండన్‌లో చాథామ్ హౌజ్ థింక్ ట్యాంక్‌తో సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడారు.
బీజేపీ ఎల్లకాలంలో అధికారంలో కొనసాగుతుందనే కలలు కంటున్నదని రాహుల్ గాంధీ అన్నారు. అది సాధ్యం కాదని చెప్పారు. ఒకసారి దీన్ని ఆలోచించండి అని పేర్కొంటూ.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సమయం అధికారంలో ఉన్నదని తెలిపారు. బీజేపీ అధికారంలో పదేళ్లు ఉండటానికి పూర్వం కాంగ్రెస్ పదేళ్లు ఉన్నదని వివరించారు.
చాథామ్ హౌజ్ థింక్ ట్యాంక్‌లో ఆర్ఎస్ఎస్ గురించి కూడా మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ఒక ఫండమెంటలిస్ట్, ఫాసిస్టస్ సంస్థ అని వివరించారు. అది భారత్‌లో ప్రజాస్వామిక పోటీనే నాశనం చేసిందని అన్నారు. అనూహ్య వేగంతో ప్రజాస్వామిక సంస్థలను గుప్పిట్లోకి తీసుకున్నదని వివరించారు.
Also Read: నారా లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా.. ఆ ప్రచారానికి తెర పడినట్టేనా..?
ఆర్ఎస్ఎస్ గురించి విదేశీ శ్రోతలకు ఎలా వివరిస్తారు? అని ప్రశ్నించగా.. దీన్ని మీరు ఒక సీక్రెట్ సొసైటీ అని పిలవొచ్చు అని రాహుల్ గాంధీ అన్నారు. ముస్లిం బ్రదర్‌హుడ్‌తో పోల్చవచ్చని తెలిపారు. ముస్లిం బ్రదర్‌హుడ్ నిర్మాణ తీరు లోనే ఆర్ఎస్ఎస్ కూడా ఉంటుందని వివరించారు. దీని ఐడియా ఏమిటంటే.. ప్రజాస్వామికంగా పోటీ చేసి అధికారంలోకి రావడం.. ఆ తర్వాత ఆ ప్రజాస్వామిక పోటీనే నాశనం చేయడం అని పేర్కొన్నారు.
అయితే, వారు దేశంలోని ఒక్కో సంస్థను తమ గుప్పిట్లోకి తీసుకునే వేగం చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రెస్, న్యాయవ్యవస్థ, పార్లమెంట్, ఎన్నికల కమిషన్ ఇలా అన్ని ప్రజాస్వామిక సంస్థలు ఒత్తిడిలో ఉన్నాయని తెలిపారు. వీటన్నిటిపై ఒత్తిడి తేవడం, వాటిని ఏదో ఒక విధంగా తమ అదుపాజ్ఞల్లోకి తెచ్చుకొన్నాయని అన్నారు.